Athadu Aame Priyudu Review: ‘అతడు ఆమె ప్రియుడు’ మూవీ ఎలా ఉందంటే..

Athadu Ame Priyidu Movie Review In Telugu - Sakshi

టైటిల్‌ : అతడు ఆమె ప్రియుడు
నటీనటులు: సునీల్, బెనర్జీ, కౌషల్, భూషణ్, మహేశ్వరి, దియా, జెన్నీ తదితరులు...
సంగీతం : ప్రద్యోతన్
కెమెరా-ఎడిటర్ : మీర్ 
నిర్మాణ సారథ్యం: అమర్,
నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్‌
విడుదల తేది: ఫిబ్రవరి4, 2022

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవలలు ఎంతలా ఫేమస్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రాసిన చాలా నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. ఓ వైపు మాటల రచయితగా మరోవైపు వ్యక్తిత్వ వికాస రచనలు చేస్తూ అనేక నవలలతో పాటు నాటికలు రాసారాయన. అగ్నిప్రవేశం, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాల ద్వారా డైరెక్టర్ గానూ తనను తాను ప్రూవ్ చేసుకున్న యండమూరి తాజాగా తన నవల “అతడు ఆమె ప్రియుడు” ద్వారా మళ్లీ దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. యండమూరి రచనా శైలి, దర్శకత్వంతో పాటు ఆకట్టుకునే టైటిల్ కావడంతో భారీ అంచనాల మధ్య సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

‘అతడు ఆమె ప్రియుడు’కథేంటంటే..?
బెనర్జీ, సునీల్, కౌషల్ పాత్రల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుని ప్రళయం రాబోతున్నట్లు వార్తలు వస్తాయి. ఉరుములు మెరుపులతో భయంకరమైన గాలి వాన మొదలౌతుంది. ఆ సమయంలో కౌషల్, సునీల్  బెనర్జీ ఇంట్లో ఆశ్రయం పొందుతారు. మరికొన్ని గంటల్లో యుగాంతం కాబోతోందని ఆ ఇంట్లో ఉన్న తమ ముగ్గురికే బతికే అవకాశం ఉందని చెబుతాడు. అయితే తమలో ఒకరు ప్రాణ త్యాగం చేసి వారి స్ధానంలో ఒక స్త్రీకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో మానవజాతి అంతం కాకుండా ఉంటుందని బెనర్జీ చెబుతాడు. దాంతో కౌషల్, సునీల్ ఆలోచనలో పడతారు. అసలు ప్రకృతి విపత్తు రావడానికి కారణం ఏంటి? బెనర్జీకి మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏంటి? సునీల్, కౌశల్ లో ఎవరు ప్రాణ త్యాగం చేస్తారు? ఆ ఇంట్లో అడుగుపెట్టిన స్త్రీ ఎవరు? బెనర్జీ చెప్పినట్లు యుగాంతం అవుతుందా?అన్నదే సినిమా కథ.

ఎవరెలా చేశారంటే?
ప్రొఫెసర్ పాత్రలో బెనర్జీ నటన ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రవర పాత్రలో సునీల్ నవ్వులు పూయించారు. ఓ వైపు ప్రళయం వస్తోందని తెలిసి భయపడుతూనే మరోవైపు కామెడీని పండించారు. స్త్రీమూర్తి ఔన్నత్యం గురించి కౌషల్ ఏకధాటిగా చెప్పిన డైలాగ్ సినిమాలో హైలైట్ అని చెప్పాలి. ధారాళంగా ఆయన చెప్పిన డైలాగ్ కి ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. కౌషల్ ప్రతీకారం తీర్చుకునే పాత్రలో నటించిన భూషణ్ (ప్రముఖ నటుడు నాగభూషణం మనవడు) ద్విపాత్రాభినయంతో అలరించాడు.


  
ఎలా ఉందంటే..?
సినిమాలోని సంభాషణలు కొన్నిచోట్ల ఆలోపించే చేసేలా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మనసుని హత్తుకుంది. కథని రక్తి కట్టించేలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయినప్పటికీ సీన్ బై సీన్ ప్రేక్షకుల్లో మరికొంత ఉత్కంఠ కలిగించేలా చూపించి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా ప్రేమంటే సెక్స్, స్నేహమనే భావనలో ఉంటున్న యూత్ కి ఈ సినిమా ద్వారా రచయిత మంచి మెసేజ్  ఇచ్చాడని చెప్పవచ్చు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top