
దాదాపు ఓ పన్నెండేళ్ల క్రితం టీవీ చానెల్‌లో న్యూస్ ప్రెజెంటర్‌గా తన ప్రస్తానం ప్రారంభమైనప్పుడు తానే కాదు ఎవరూ ఊహించి ఉండరు.. ఇంతగా, ఇన్ని విధాలుగా అనసూయ(Anasuya Bharadwaj) తెలుగు వారికి దగ్గరవుతుందని. కేవలం పుష్కర కాలంలో పుష్కలమైన అవకాశాలు అందుకుంటూ అంతకంతకూ ఎదుగుతూ వచ్చిన అనసూయ...స్టార్ యాంకర్ నుంచి సిల్వర్ స్క్రీన్ స్టార్ దాకా దూసుకుపోయింది.

తెలుగులో చిన్నితెర మీద యాంకర్, ప్రోగ్రామ్ హోస్ట్‌గా చేసిన ఎవరూ సాధించలేకపోయిన క్రేజ్‌ను ఆమె స్వంతం చేసుకుంది. ఓ వైపు యాంకర్‌గా పలు టీవీ షోస్‌లో కనిపిస్తూనే, మరోవైపు వెండితెర మీద కూడా తనదైన ముద్ర వేస్తోంది. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాల్లోని ఆమె పాత్రలు సినీరంగంలో ఆమె అవకాశాలను విస్త్రుతం చేశాయి. ప్రస్తుతం అనసూయ చిన్నితెర మీద కావచ్చు, వెండితెర మీద కావచ్చు, పబ్లిక్ ఈవెంట్స్ లో కావచ్చు... ఫుల్ క్రే జ్ ఉన్న సెలబ్రిటీ అనడంలో అతిశయోక్తి లేదు

అయితే ప్రస్తుతం సెలబ్రిటీల ఇమేజ్, పాప్యులారిటీని సరైన రీతిలో అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. గతంలో ఒక నటి/నటుడు, యాంకర్ ఎవరైనా సరే తమ ప్రతిభ ద్వారా మాత్రమే అత్యున్నత స్థానాన్ని సాధించారని చెప్పేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాలు, రీల్స్...వగైరాలు వెల్లువెత్తుతూ సినీ విమర్శకుల్ని సైతం సెలబ్రిటీల స్థాయిపై విశ్లేషణలకు వీలు లేకుండా చేస్తూన్నాయి. మరోవైపు అనసూయ సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ.

ఆమెను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంచిన వాటిలో ఆమె గ్లామర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందనేది నిర్వివాదం. ఆ విషయం ఆమె కూడా గుర్తించింది కాబట్టే సినిమాల్లో కాకున్నా, సోషల్ మీడియాలో గ్లామరస్ పోస్టులు, వీడియోల ద్వారా మెరిపిస్తూ ఉంటుంది. తన దుస్తులు, వస్త్రధారణ విషయంలో వచ్చే విమర్శలకు ఘాటుగా బదులిస్తూ ప్రతి విమర్శలు చేస్తూ వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. వీటన్నింటి నడుమ... ఆమె దురదృష్టమో అదృష్టమో కానీ.. ఎన్ని వైవిధ్యభరిత చిత్రాల్లో నటించినా, అనసూయ అనగానే ఓ అందమైన అమ్మాయి అనే భావనే సినీ అభిమానుల్లో స్థిరపడిపోయింది.

ఏదేమైనా దాదాపు పాతికేళ్లు పైబడిన వయసులో ‘షో’ బిజినెస్‌లోకి ఆరంగేట్రం చేసిన అనసూయ నిన్నటి(మే 15)తో ఫార్టీ ప్లస్ వయస్కుల క్లబ్‌లోకి చేరుతోంది. ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా ఈ గ్లామర్ ఇకపై ఎంతకాలం నిలుస్తుందో తెలీదు. కాబట్టి ఇకపై నటనలో కూడా తనేంటో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

ఇప్పటిదాకా ఎంచుకున్నట్టే వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ.. గ్లామర్ డోస్‌ను తగ్గిస్తూ... అందమైన మహిళ అనే అభిప్రాయాన్ని మరిపిస్తూ.. అభినయ ప్రావీణ్యమున్న నటిగా కూడా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేయగలిగితే మరికొన్ని దశాబ్ధాల పాటు ఆమెకు తిరుగు ఉండకపోవచ్చు.