
చిత్ర పరిశ్రమలో చాన్స్ దొరకడమే కష్టం కానీ..ఒక్కసారి చాన్స్ వచ్చి, మంచి హిట్ పడితే..ఇక ఆ నటీనటులకు తిరుగుండదు. వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. పారితోషికం సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది ఆ ‘ఒకే ఒక చాన్స్ ’కోసం ఎదురు చూస్తుంటారు. అలా వచ్చిన అవకాశం అందిపుచ్చుకొని నిరూపించుకుంటే.. కొన్ని ఏళ్ల వరకు ఢోకా ఉండదు. ముఖ్యంగా హీరోలకైతే వయసు మీద పడినా.. సినిమా చాన్స్‌లు తగ్గవు. ఒకవేళ తగ్గినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో.. క్యామియో రోల్‌గానో మెరిసి సొమ్ము చేసుకుంటారు.
మరికొంతమంది హీరోలు అయితే సోలోగా సినిమాలు చేస్తూనే..అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాల్లో క్యామియో రోల్ ప్లే చేస్తుంటారు. అలాంటి వారిలో అజయ్ దేవగణ్ ఒకరు. ఒకవైపు సోలో హీరోగా చేస్తూనే.. మరోవైపు అతిధి పాత్రల్లో మెరుస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరో క్యామియో రోల్ చేసినా..రెమ్యునరేషన్ మాత్రం హీరో స్థాయిలోనే తీసుకుంటున్నాడట. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో క్యామియో కోసం నిమిషానికి రూ. 4.35 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే ఈ చిత్రానికిగానే అజయ్ భారీగానే పారితోషికంగా పుచ్చుకున్నాడట.
ఈ ఒక్క చిత్రానికి రూ. 35 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అజయ్ కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఈ లెక్కన నిమిషానికి రూ.4.35 కోట్ల చొప్పున ఆయన తీసుకున్నాడు. క్యామియో రోల్‌కి ఈ స్థాయి రెమ్యునరేషన్(నిమిషాలతో పోల్చి చూస్తే) తీసుకుంటున్న నటుల్లో అజయ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే హీరోగా చేస్తున్న సినిమాలకు మాత్రం ప్రాజెక్ట్‌ని బట్టి పారితోషికం తీసుకుంటాడట. బడా ప్రాజెక్టు అయితే రూ. 40 కోట్లు తీసుకునే అజయ్.. రైడ్ 2 వంటి చిన్న చిత్రాలకు సగం తగ్గించి రూ. 20 కోట్ల వరకే తీసుకుంన్నాడట. అజయ్ ప్రస్తుతం దేదే ప్యార్ దే 2, సన్నాఫ్ సర్ధార్ 2, దృశ్యం 3 వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.