
రోహిణి హట్టంగడి, కుటుంబరావు, రోహిణి, ఓల్గా
రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఒక మంచి ప్రేమకథ’(Oka Manchi Prema Katha) . ఈ సినిమాకు కథ, మాటలు, పాటలను ఓల్గా అందించగా, అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించారు. హిమాంశు పోపూరి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రోహిణి ముల్లేటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పాత్రను చూస్తే, ఆడియన్స్ కోప్పడతారు’’ అని అన్నారు.
‘‘ఇరవైఏళ్ల క్రితం కుటుంబరావు, ఓల్గాగార్లు ఓ సినిమా కోసం నన్ను అ్రపోచ్ అయ్యారు. అప్పుడు అది కుదర్లేదు. ఇప్పుడు ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నా మనసుని హత్తుకుంది’’ అని పేర్కొన్నారు రోహిణి హట్టంగడి. ‘‘అందరిలోనూ ఓ ఆలోచనను రేకెత్తించేలా ఈ సినిమాను తెరకెక్కించాను. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆడియన్స్‌ను నవ్విస్తూ, ఏడిపించేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని తెలిపారు అక్కినేని కుటుంబరావు.
‘‘ఈ సినిమాలో నేను కూడా ఓ రోల్ చేశాను. అందరికీ నచ్చే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు హిమాంశు. ‘‘మంచి సినిమా రావాలని కోరుకునే ఆర్టిస్టులు మాకు దొరకడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఓల్గా. సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్, ఈటీవీ విన్ ప్రతినిధులు సంధ్య, నితిన్ మాట్లాడారు.