
వరుసగా సామాన్యులను బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తున్నారు. మనీష్, ప్రియ, హరిత హరీశ్.. ఇప్పుడు శ్రీజ! అందదరూ తమ చేతులారా ఎలిమినేషన్‌ను కొనితెచ్చుకున్నవాళ్లే! మొదటి రెండువారాల్లో శ్రీజను చూసిన జనాలు ఈమె ఎప్పుడు వెళ్లిపోతుందిరా బాబూ.. నోరేసుకుని పడిపోతుంది! అని అసహనం వ్యక్తం చేశారు. శ్రీజ ఎలిమినేట్ కావాల్సిందే! అని బలంగా కోరుకున్నారు.
అన్‌ఫెయిర్ ఎలిమినేషన్
కానీ ఇప్పుడు సీన్ మారింది. శ్రీజ (Srija Dammu) ఎలిమినేషన్‌ను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది కదా విజయం అంటే! తన తప్పులు తెలుసుకుంది. నాగార్జున చెప్పిన హింట్స్‌ను, వీకెండ్‌లో స్టూడియోలో జనాల రెస్పాన్స్‌ను అన్నింటినీ శ్రద్ధగా గమనించింది. ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చింది.
వరస్ట్ నుంచి తోపు కంటెస్టెంట్‌గా..
అరవడం తగ్గించింది. అవసరమైనచోట మాత్రం ఆడపులిలా నిలబడి మాట్లాడింది. ఆటలో అయితే ఆడ,మగ తేడా లేకుండా అందరిపైనా విరుచుకుపడింది. గెలుపొక్కటే నా లక్ష్యం అన్నచందంగా ఆడింది. చెత్త కంటెస్టెంట్ నుంచి తోపు కంటెస్టెంట్‌గా నిలిచింది. స్నేహితుడు పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన మాట ప్రకారం అతడిని కెప్టెన్‌ను చేసింది. ఈ క్రమంలో తనే బలిపశువైంది. గతవారం ఇంటిసభ్యులను జంటలుగా విడిపోమంటే శ్రీజ అతి తెలివితో కల్యాణ్‌తో జత కట్టలేదు.

వైల్డ్‌కార్డ్స్ వల్ల గేమ్ నుంచి అవుట్
ఒకే జట్టుగా ఉంటే అందరికీ ఈజీ టార్గెట్ అయిపోతామని.. చివర్లో మనిద్దర్లో ఒకరికి మాత్రమే ఏదైనా మంచి జరిగే ఛాన్స్ ఉందని చెప్పింది. అలా పవన్.. తనూజతో, శ్రీజ.. సుమన్‌తో జత కట్టింది. గేమ్స్ అన్నీ అయిపోయేసరికి పవన్-తనూజ జట్టు సేఫ్ అయ్యారు. శ్రీజ-సుమన్ డేంజర్ జోన్‌లో పడ్డారు. తన స్ట్రాటజీ వల్ల పవన్‌కు కలిసొచ్చింది కానీ శ్రీజ చిక్కులో పడింది. ఇప్పుడేకంగా వైల్డ్ కార్డ్స్ ఆమెను గడ్డిపోచలా ఆటలో నుంచి తీసేశారు.
ఆడపులి రెమ్యునరేషన్
గెలిచే వస్తానని కొండంత ఆశలు పెట్టుకున్న శ్రీజకు ఇది జీర్ణించుకోలేని విషయం. ఏదేమైనా తిట్టిన నోళ్లతోనే ఆడపులి అని పిలిపించుకోవడమంటే ఆషామాషీ కాదు. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్న అందరిలాగే శ్రీజకు సైతం వారానికి రూ.60-70 వేల మేర రెమ్యునరేషన్ అందింది. ఈ లెక్కన ఐదు వారాలకుగానూ రూ.3 లక్షల నుంచి రూ. 3.50 లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తోనే బతుకుతున్నా.. నరకం చూడని రోజంటూ లేదు