ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు | Actor Vinod Suryavanshi About His Village Caste Discrimination | Sakshi
Sakshi News home page

Vinod Suryavanshi: ఎవరైనా ఏదైనా ఇస్తే మాత్రమే మాకు పండగ

Apr 22 2026 10:39 AM | Updated on Apr 22 2026 10:47 AM

Actor Vinod Suryavanshi About His Village Caste Discrimination

హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, 'పంచాయత్' సిరీస్‌లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ సూర్యవంశీ.. ఇప్పటికీ తన కుటుంబం కర్ణాటకలోని తన సొంతూరిలో కుల వివక్ష ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చాడు. ప్రముఖ యూట్యూబర్ సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన సంభాషణలో భాగంగా ఈ ఆశ్చర్యకర సంగతి చెప్పి షాకిచ్చాడు. పేదరికం కారణంగా తను ఇప్పటివరకు ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నాడో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. చనిపోయిన ప్రముఖ దర్శక నిర్మాత)

'మా ఊరిలో ఇప్పటికీ అగ్ర కులాలు, బలహీన వర్గాల కోసం వేర్వేరు ప్రాంతాలున్నాయి. దళితులు నివసించే ప్రాంతం గ్రామానికి దూరంగా ఉంటుంది. నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు నాన్నతో కలిసి ఊరి లోపలికి వెళ్లినప్పుడు ఓ హోటల్‌లో తిన్నాం. కానీ తర్వాత మేమే ప్లేట్లు కడగాల్సి వచ్చింది. అలానే ఇప్పటికీ ఊరిలోని దేవాలయంలోకి మాకు అనుమతి లేదు' అని వినోద్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.

ఇక చిన్నప్పటి కష్టాలు గుర్తుచేసుకున్న వినోద్.. పండగలు వచ్చాయంటే సంతోషం కంటే మాకు బాధే ఎక్కువగా ఉండేది. దీపావళి ఎందుకు వస్తుందా అనిపించేంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇస్తే మాత్రమే మేం పండగ జరుపుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కుటుంబం విషయానికొస్తే.. నా తల్లి ఇళ్లలో పనిచేసేది. నాన్న మేస్త్రీ. ఆయనకు రోజూ పని దొరికేది కాదు. పనిలేకపోతే తాగొచ్చి అమ్మని ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడు. ఆయనంటే కోపం లేదు కానీ ఎందుకనో నాన్న ప్రవర్తన నచ్చేది కాదని అన్నాడు.

సినిమా కెరీర్ గురించి చెబుతూ.. ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో పనులు చేశాను. మొదటి లిఫ్ట్ మ్యాన్‌గా నెలకు రూ.1600 జీతానికి పనిచేశా. తర్వాత ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేశాను. గార్డ్‌గా పనిచేసినప్పుడు 12 గంటలు నిలబడి పనిచేయాల్సి వచ్చేది. వర్షం పడితే చెప్పుల్లోకి నీళ్లు చేరి గాయాలయ్యేవి. కొందరు అకారణంగా తిట్టేవారని వినోద్ గుర్తుచేసుకున్నాడు. ఏ పని చిన్నది కాదంటారు గానీ నిజానికి మనిషిని అతడు చేసే పనిబట్టి అంచనా వేస్తారు. పని పెద్దదైతేనే గౌరవం కూడా ఎక్కువగా ఉంటుందని వినోద్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. హిందీలో పంచాయత్ సిరీస్‌తో పాటు జాన్‌వర్, థామా, సత్యమేవ జయతే, జాలీ ఎల్ఎల్‌బీ 3 తదితర సినిమాల్లో వినోద్ సూర్యవంశీ నటించాడు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement