
సమాజం నాకెంతో ఇచ్చింది.. మరి సమాజానికి నేనేం ఇచ్చాను? అని ఆలోచించేవారు కొద్దిమందే ఉంటారు. వారిలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ముందు వరుసలో ఉంటాడు. నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలన్న సంకల్పంతో సూర్య.. అగరం పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు. తమిళనాడులో పేద, వెనుకబడిన సామాజిక విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది. ఇటీవలే ఈ సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.
నా జీవితం ఓ సినిమా కథ
ఈ కార్యక్రమంలో ఓ యువతి.. అగరం ఫౌండేషన్ వల్ల తన జీవితమే మారిపోయిందని స్పీచ్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. నాపేరు జయప్రియ. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. నా జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. మొదట్లో ఆ సంతోషం అన్న పదమే మా జీవితాల్లో లేదు. అదెందుకో మీకు చెప్తాను. ఇదొక సినిమాకథలా అనిపించొచ్చు. మాది చిన్న ఊరు. ఆ ఊరి పేరు అగరం. ఆ గ్రామంలో ఓ తాగుబోతు తండ్రి ఉండేవాడు.

పూరి గుడిసెలో జీవితం
అతడితో తాగుడు మాన్పించలేక భార్య మౌనంగా ఏడుస్తూ ఉండేది. వీరికి ఇద్దరు కూతుర్లు. వాళ్లది మట్టి గోడలతో కట్టిన ఇల్లు (పూరి గుడిసె). తాటాకులే ఇంటి పైకప్పు. వర్షం వచ్చిందంటే నీళ్లన్నీ ఇంట్లోకి వచ్చేవి. ఆ ఇంటికి పాములు చుట్టాల్లా తరచూ వస్తుండేవి. ఇదే నా జీవితం. కరెంటు లేదు. ఇంటికి మంచినీటి కనెక్షన్ లేదు. కానీ చదువుకోవాలన్న కోరిక మాత్రం నాకు బలంగా ఉండేది. చదువులోనూ ముందుండేదాన్ని. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేదాన్ని.
నెక్స్ట్ ఏంటి?
కొంతకాలానికి మేమున్న ఇల్లు కూలిపోయింది. అమ్మానాన్న నిరుపేదలు. ఏమీ చేయలేకపోయారు. చూస్తుండగానే 12వ తరగతి పూర్తి చేశాను. కాలేజీ టాపర్‌గా నిలిచాను. తర్వాతేం చేయాలో తోచలేదు. మా మేడమ్ అగరం ఫౌండేషన్ నెంబర్ ఇచ్చింది. వాళ్లు నాకు సాయం చేస్తారంది. 2014లో అగరం ఫౌండేషన్‌కు కాల్ చేశాను. అప్పుడే నా జీవితం ఆనందంగా ముందుకుసాగింది.
గోల్డ్ మెడల్
మంచి కాలేజీలో చేర్పించారు. కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. అన్నా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాను. తర్వాత టీసీఎస్‌లో చేరాను. కొంతకాలానికి ఇన్ఫోసిస్‌కు మారాను. నాకున్న ఏకైక కల సొంతిల్లు. నేను సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు కట్టాలి. అందులో అమ్మానాన్న ప్రశాంతంగా నిద్రించాలి. అగరం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. పెద్ద ఇల్లు కట్టాను.
గర్వంగా చెప్తున్నా
ఒకటి కాదు ఇప్పుడు నాకు రెండు ఇండ్లున్నాయని గర్వంగా చెప్తున్నాను. దీనంతటికీ కారణం అగరం ఫౌండేషన్. ఆడపిల్లలకు చదువెందుకు అని ఇప్పటికీ కొందరు అంటుంటారు. అమ్మాయిలను చదవనివ్వండి. చదివితేనే కదా ఏదో ఒకటి చేయగలం అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు సూర్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆమె విజయాన్ని అభినందిస్తూ లేచి చప్పట్లు కొట్టాడు.