Chalapathi Rao: ఆ డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న చలపతిరావు

Actor Chalapathi Rao Wanted to Commit Suicide - Sakshi

పన్నెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి హీరోలకు సమానమైన గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్‌ నటుడు చలపతిరావు. ఆయన మొదటగా సీనియర్‌ ఎన్టీఆర్‌ 'కథానాయకుడు' సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత ఆయన 'గూఢచారి 116' సినిమా చేశారు, తర్వాత 'సాక్షి' సినిమాలోనూ కనిపించారు. ఇక ఆగిపోయిన 'కథానాయకుడు' సినిమాను తిరిగి తెరకెక్కించడంతో అందులోనూ భాగమయ్యారు చలపతిరావు. తర్వాత వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇకపోతే చలపతిరావుది ప్రేమ వివాహం. ఆయన సతీమణి పేరు ఇందుమతి. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. వీళ్లు చెన్నైలో ఉంటున్నప్పుడు వేకువజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇందుమతి చీరకు నిప్పంటుకుంది. ఆమె కేకలు విన్న చలపతి రావు వెళ్లి మంటలార్పారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో మూడురోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచిందావిడ. ఆమె మరణంతో కుంగిపోయిన చలపతిరావు ఆత్మహత్య చేసుకుందామనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'మాది లవ్‌ మ్యారేజ్‌. పెళ్లయ్యాక మద్రాసు వెళ్లిపోయాం. మాకు ముగ్గురు పిల్లలు పుట్టారు. రవి బాబుకు ఆరేళ్లు, రెండో అమ్మాయికి నాలుగేళ్లు, మూడో అమ్మాయికి రెండేళ్లు వయసున్నప్పుడు నా భార్య చనిపోయింది. ఎంతో బాధపడ్డాను. పిల్లలు చాలా చిన్నవాళ్లు.. ఓ చిన్న ఇంట్లో ఉండేవాడిని. నేను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. అప్పుడు ఛాన్సులు కూడా లేవు. చాలామంది పెళ్లి చేసుకోమని, పిల్లల్ని మేము చూసుకుంటామని ముందుకు వచ్చారు. ఎన్టీఆర్‌ సతీమణి తారకమ్మ కూడా పెళ్లి చేసుకోమంది. లేటు వయసులో నీతో మాట్లాడటానికి కూడా ఎవరూ ఉండరు. పిల్లలు పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు. నీకంటూ ఓ తోడు ఉండాలి కదా అని నచ్చజెప్పారిద్దరూ. కానీ పెళ్లి చేసుకుంటే వచ్చే వ్యక్తి నా పిల్లల్ని బాగా చూసుకుంటుందో లేదో! అందుకని నేను మెంటల్‌గా ఒకటే డిసైడయ్యా.. నా పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాను. నా పిల్లల్ని చూడటానికి మా అమ్మను రమ్మన్నాను. ఆమె కూడా పెళ్లి చేసుకోమని పోరు పెడితే సరేలే అని అప్పటికి సర్ది చెప్పాను.

కానీ ఓ రోజు ఒక వ్యక్తి మా ఇంటికొచ్చి తన కూతుర్ని నా దగ్గర వదిలేసి వెళ్లిపోతానన్నాడు. వద్దుబాబూ అని దండం పెట్టి వేడుకున్నాను. కొందరు ఆర్టిస్టులు కూడా పెళ్లి చేసుకోమని గొడవపెట్టారు. నేను మాత్రం పిల్లల్ని పెంచి పెద్ద చేయాలని మెంటల్‌గా ఫిక్సయ్యాను. కానీ నా దగ్గర చిల్లి గవ్వ లేకపోవడంతో డిప్రెషన్‌లో ఉండిపోయాను. అప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అయితే రేపు పొద్దున నేను చనిపోతే నా పిల్లలు అడుక్కుతింటారని ఆలోచించి ఆ ఆలోచన విరమించుకున్నా. నిజానికి మద్రాసు వెళ్లేటప్పుడు లక్ష రూపాయలు పట్టుకొచ్చాను. చివరికి బస్సెక్కడానికి పది పైసలు లేని హీనస్థితికి వచ్చాను. అలాంటి స్థితిలో పిల్లల్ని ఎలా చదివిస్తానో అనుకున్నా.. మళ్లీ వేషాల కోసం తిరిగి ఛాన్సులు సంపాదించాను. అనుకున్నట్లుగానే పిల్లల్ని బాగా చదివించాను' అని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు చలపతిరావు.

చదవండి: చలపతిరావు లవ్‌ మ్యారేజ్‌.. ఇంట్లో చెప్పకుండా పెళ్లి
చికెన్‌ బిర్యానీ తిని అలా వెనక్కు వాలిపోయారు: రవిబాబు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top