టర్కీలో ప్రపోజ్.. గోవాలో పెళ్లి.. దృశ్యం-2 దర్శకుడి లవ్‌ స్టోరీ

Abhishek Pathak to marry Shivaleeka Oberoi in February in Goa - Sakshi

దృశ్యం-2 దర్శకుడు అభిషేక్ పాఠక్ తన ప్రియురాలిని వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరిలో గోవాలో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. గోవాలోని బీచ్ టౌన్‌లో పెళ్లి రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాలు ధృవీకరించాయి. కాగా.. అజయ్ దేవగణ్, శ్రియాశరణ్ నటించిన దృశ్యం-2 మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

టర్కీలోని ఓ పర్వత ప్రాంతంలో ఖుదా హాఫీజ్ ఫేమ్ శివలీకా ఒబెరాయ్‌కి అభిషేక్ పాఠక్ ప్రపోజ్ చేశాడు. వీరి పెళ్లి వార్తలు రావడంతో ప్రస్తుతం శివాలికా ఒబెరాయ్‌కి ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిబ్రవరిలో జరగనున్న బాలీవుడ్ జంట గ్రాండ్ వెడ్డింగ్‌కి సినీ ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 

అభిషేక్‌తో రిలేషన్‌పై ఓ ఇంటర్వ్యూలో శివాలికా మాట్లాడుతూ.. 'మా రిలేషన్ గురించి విని అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి కొంతమందికి ఈ విషయం తెలుసు. నేను ఖుదా హాఫీజ్ కోసం ఆడిషన్‌కు వెళ్లా. అభిషేక్‌ను కలవడానికి ముందే కుమార్‌జీ (కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ తండ్రి)ని కలవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని తర్వాత తెలుసుకున్నా. మేము ఒకరినొకరు తెలిసుకుని చాలా కాలం కాలేదు. కానీ ఏదైనా మనసుకు నచ్చితే అదే సరైందని నమ్ముతా. అప్పుడు అభిషేక్ దృశ్యం-2 షూటింగ్‌లో ఉన్నాడు. ఎన్నో ఆంక్షలున్నా కలిసేందుకు రెండేళ్లుగా తగిన సమయాన్ని వెచ్చించా.' అని తెలిపింది. 

కాగా.. అభిషేక్ పాఠక్ ఇటీవలే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దృశ్యం-2 సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, టబు, అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్ నటించారు. మరోవైపు శివాలీకా ఒబెరాయ్ బాలీవుడ్‌లో అమ్రిష్ పూరి మనవడు వర్ధన్ పూరి సరసన యే సాలి ఆషికితో అడుగుపెట్టింది. ఆమె ఖుదా హాఫీజ్, ఖుదా హాఫీజ్- 2 వంటి చిత్రాలలో కూడా నటించింది.  అభిషేక్ పాఠక్ నిర్మాతగా వ్యవహరించిన ఖుదా హాఫీజ్ సెట్‌లోనే ఈ జంట మొదటిసారి కలుసుకున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top