
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తన భార్య ఆర్తితో విభేదాలు రావడంతో ఇప్పటికే డివోర్స్ తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ సింగర్ కెన్నీషాతో జయం రవి కనిపించడంతో వారిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఓ పెళ్లిలో వీరిద్దరు అత్యంత సన్నిహితంగా ఉంటూ కనిపించారు. అంతేకాకుండా తమ మధ్య విభేదాలకు మూడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆర్తి కూడా ఆరోపించింది.
తాజాగా సింగర్ కెన్నీషా ఫ్రాన్సిస్తో కలిసి జయం రవి తిరుమలను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో మరోసారి వీరిద్దరి విడాకుల టాపిక్ తెరపైకి వచ్చింది. ఇది చూసిన ఆర్తి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది.
ఆర్తి తన ఇన్స్టాలో రాస్తూ..'నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ, దేవుడిని మోసం చేయలేవు' అని తన స్టోరీస్లో పోస్ట్ చేసింది. అయితే జయం రవి- కెన్నీషా తిరుమల దర్శనాన్ని ఉద్దేశించే ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ పోస్ట్ పెట్టి ఉంటారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా.. చెన్నైలో తన ప్రొడక్షన్ హౌస్ ప్రారంభోత్సవానికి ముందు రవి, కెనీషా తిరుపతి వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు.
మరోవైపు ఈ జంట విడాకులు ప్రకటించిన సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్తి తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.