వినోదాల సందడి | 2026 April Month theatre release upcoming Telugu movies list | Sakshi
Sakshi News home page

వినోదాల సందడి

Mar 25 2026 3:23 AM | Updated on Mar 25 2026 3:25 AM

2026 April Month theatre release upcoming Telugu movies list

ఏప్రిల్‌ నెలలో వరుస సినిమాల జోరు

మార్చి నెల ముగింపుకు వచ్చింది. దీంతో ఏప్రిల్‌ నెలలో ఏయే సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయనే చర్చ ఆడియన్స్‌లో మొదలైంది. వచ్చే నెలలో డిఫరెంట్‌ జానర్స్‌లోని సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ జాబితాలో ‘పెద్ది’ వంటి పెద్ద చిత్రం నుంచి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి చిన్న చిత్రాలు చాలానే ఉన్నాయి. మరి... ఏ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? ఆ సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయాలు ఈ విధంగా...

పెద్ది పోరాటం 
వచ్చే నెల చివర్లో థియేటర్స్‌లోకి రానున్నాడు పెద్ది. రామ్‌ చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్‌ అండ్‌ పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. రామ్‌ చరణ్‌ పాల్గొంటుండగా క్లైమాక్స్‌కు చెందిన టాకీ పార్టు చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. అయితే ఇంకా సాంగ్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. తొలుత ‘పెద్ది’ని రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్‌ చేయా లనుకున్నారు మేకర్స్‌. కానీ ఏప్రిల్‌ 30కి వాయిదా వేశారు.

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో టీమ్‌ చాలా స్పీడ్‌గా షూటింగ్‌ చేస్తోంది. ఆల్రెడీ ఒకసారి సినిమా రిలీజ్‌ వాయిదా పడిన నేపథ్యంలో మరోసారి ఇలా జరగకూడదని పక్కా ప్లాన్‌తో షూటింగ్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు మేకర్స్‌. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్స్‌ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్‌ చేశారు. ఇందులో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉందని తెలిసింది. ఈ స్పెషల్‌ సాంగ్‌లో మృణాల్‌ ఠాకూర్‌ డ్యాన్స్‌ చేస్తారని, ఇదే సాంగ్‌లో ఈ చిత్రం హీరో హీరోయిన్లు రామ్‌ చరణ్, జాన్వీ సైతం కాలు కదుపుతారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

అలాగే ఈ నెల 27న రామ్‌చరణ్‌ బర్త్‌ డే. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ నుంచి సర్‌ప్రైజింగ్‌గా ఓ యాక్షన్‌ టీజర్‌ను రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేసిందని తెలిసింది. ‘పెద్ది’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌లో రామ్‌చరణ్‌ క్రికెటర్‌గానే కనిపించారు. కానీ రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా రాబోతున్న యాక్షన్‌ టీజర్‌లో చరణ్‌ కుస్తీ పడుతున్న సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇంకా ‘పెద్ది’ చిత్రంలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి ఇతర క్రీడల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది.

అంతేకాదు... ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఊరిలో నెలకొన్న ఓ సమస్య కోసం హీరో పాత్ర పోరాటం చేస్తుందని సమాచారం. ఈ చిత్రంలో శివ రాజ్‌ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌  సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఎమోషనల్‌ బైకర్‌ 
ఏప్రిల్‌ 3న థియేటర్స్‌లోకి దూసుకు రానున్నాడు బైకర్‌. శర్వానంద్‌ హీరోగా నటించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘బైకర్‌’. మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘వాడికి రేసింగ్‌ అంటే ప్రాణం..’, ‘నువ్వు అందరికంటే ముందు రాలేదు... నీ కంటే అందరూ వెనకాల వచ్చారు.

రెండింటికి చాలా తేడా ఉంది’, ‘విక్కీతో కొంచెం మాములుగా ఉండొచ్చు కదా... ఎందుకంత కంట్రోల్‌ చేస్తావ్‌..., ఈగో ఇంపార్టెంట్‌ కాదు సుదర్శన్‌... నథింగ్‌ ఈజ్‌ బిగ్గర్‌ థేన్‌ స్పోర్ట్‌’, ‘నీలాంటి పిరికివాడితో పని చేయడం నాకు తెలియదు రా..’, ‘వాళ్ల నాన్నకు విక్కీ కొడుకు కాదు... రేసర్‌ అంతే..’, ‘కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రిని ఒక్కర్ని చూపించు’ వంటి డైలాగ్స్‌ ‘బైకర్‌’ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలో వికాస్‌ నారాయణన్‌ పాత్రలో శర్వానంద్, బుల్లెట్‌ సునిల్‌ పాత్రలో రాజశేఖర్‌ నటించారు. ఇందులో రాజశేఖర్, శర్వానంద్‌ తండ్రీకొడుకులుగా చేశారు.

‘బైకర్‌’ సినిమాలో రైసింగ్‌ అంశాలతో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి. ఈ సినిమా కథ 1990, 2000... ఇలా రెండు డిఫరెంట్‌ టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. ఇండియాస్‌ ఫస్ట్‌ మోటోక్రాస్‌ రేసింగ్‌ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాకు అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహించగా, జిబ్రాన్‌ సంగీతం అందించారు. విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ‘బైకర్‌’ సినిమాను తొలుత గత ఏడాది డిసెంబరు 5న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్స్‌లో రాజీ పడకూడదని, యూనిట్‌ ఈ సినిమా రిలీజ్‌ను ఏప్రిల్‌ 3కి వాయిదా వేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత శర్వానంద్‌ నుంచి రానున్న ‘బైకర్‌’ చిత్రంపై ఆడియన్స్‌లో అంచనాలు ఉన్నాయి.

మాజీ ప్రేమికుల ప్రయాణం 
బ్రేకప్‌ తర్వాత ఇద్దరు మాజీ ప్రేమికులు మళ్లీ కలిసి ఓ క్రైమ్‌ చేయాల్సి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రేమికులు తిరిగి ప్రేమలో పడతారా? ఈ ప్రయాణంలో వారు వాళ్ల గురించి ఏం తెలుసుకున్నారు? అన్న అంశాల నేపథ్యంలో ‘డెకాయిట్‌’ సినిమా తెరకెక్కిందని తెలిసింది. ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర చేశారు. దర్శక–నిర్మాత మన్సూర్‌ ఖాన్‌ కుమార్తె, ఆమిర్‌ ఖాన్‌ మేనకోడలు జైన్‌ మేరీ ఖాన్‌ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు.

అనురాగ్‌ కశ్యప్, జైన్‌ మేరీ... ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాదాపు 150 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో వచ్చే ఓ రాబరీ ఎపిసోడ్, అలాగే ‘కన్నె పిట్టరో..’ పాట హైలైట్స్‌గా ఉంటాయని సమాచారం. షానియల్‌ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో స్వరకర్త. సునీల్‌ నారంగ్‌ సహ–నిర్మాతగా వ్యవహరించారు.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. తొలుత ‘డెకాయిట్‌’ సినిమాను మార్చి 19న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. అయితే ఆ తేదీకి రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ సినిమా రిలీజ్‌కు షెడ్యూల్‌ కావడంతో ‘డెకాయిట్‌’ను ఏప్రిల్‌ 10కి వాయిదా వేశారు. ఈ నెల 28న ఈ సినిమా నుంచి ‘చిచ్చుబడ్డి’ అనే పాట లిరికల్‌ వీడియో రిలీజ్‌ కానుంది.

ఈ సంగతి ఇలా ఉంచితే... 2022లో అడివి శేష్‌ హీరోగా ‘హిట్‌: ది సెకండ్‌ కేసు’ సినిమా వచ్చింది. ఈ చిత్రం తర్వాత అడివి శేష్‌ సోలో హీరోగా మరో సినిమా థియేటర్స్‌కు రాలేదు. మూడు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా అడివి శేష్‌ నుంచి రాబోతున్న ‘డెకాయిట్‌’ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్‌లో నెలకొని ఉంది. ఇక గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హిట్‌: ది థర్డ్‌ కేసు’ చిత్రంలో అడివి శేష్‌ ఓ అతిథి పాత్రలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

కాపాడే కవచం 
నిఖిల్‌ హీరోగా నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘స్వయంభూ’. సంయుక్త, నభా నటేష్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిం చారు. ఈ భారీ బడ్జెట్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాను భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మించారు. అయితే ‘స్వయంభూ’ సినిమాను తొలుత ఫిబ్రవరి 13న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు   మేకర్స్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. అయితే ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్, వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఏప్రిల్‌ 10న విడుదల కాకపోవచ్చనే టాక్‌ తెరపైకి వచ్చింది.

అంతేకాదు... ఏప్రిల్‌ 30న ‘పెద్ది’ సినిమా ఒకవేళ విడుదల కాకపోతే, ఆ తేదీకి తమ సినిమా విడుదలయ్యేలా ‘స్వయంభూ’ టీమ్‌ ప్లాన్‌ చేస్తోందని సమాచారం. ఇక ఇటీవల ‘స్వయంభూ’ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి, శ్రీరాముడికి అందించిన ఈ సింగోలుకి కూడా అరణ్యవాసమా?’, ‘యుద్ధమా?’, ‘అంతర్యుద్ధం..’, ‘కాలం కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా..’, ‘బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా... కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది’ వంటి డైలాగ్స్‌ ఈ టీజర్‌లో ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందించారు.

అమెరికా రిటర్న్స్‌ 
సంగీత్‌ శోభన్‌ హీరోగా నటించిన ఫ్యాంటసీ అండ్‌ అడ్వెంచరస్‌ కామెడీ సినిమా ‘రాకాస’. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్‌ సిరీస్‌కు రైటర్‌గా, ‘బెంచ్‌లైఫ్‌’ సిరీస్‌కు దర్శకురాలిగా చేసిన మానసా శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మానసా శర్మకు ఇది తొలి ఫీచర్‌ ఫిల్మ్‌. ఈ చిత్రంలో నయన్‌ సారిక హీరోయిన్‌గా నటించారు. ఉమేష్‌ కుమార్‌ బన్సల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. ఇటీవల ‘రాకాస’ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘నరకం నుండి సందేశం వస్తుంది.

ఇక సమయం లేదు’, ‘మన ఊరి శాపం ఇది’, ‘మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’, ‘ఐయామ్‌ వీరూ సార్‌... అమెరికా రిటర్న్స్‌’, ‘నేను రైట్‌ అడ్రస్‌కు వచ్చిన రాంగ్‌ పర్స్‌ని సార్‌... నాకు, ఈ ఊరికి అస్సలు సంబంధం లేదు సార్‌...’, ‘ఇది ఆఖరి హెచ్చరిక’ వంటి డైలాగ్స్‌ ఈ సినిమా టీజర్‌లో ఉన్నాయి. అయితే టీజర్‌లోని కంటెంట్, డైలాగ్స్‌ను బట్టి ‘రాకాస’ కథనం ఓ ఊరు, అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. నేడు (బుధవారం) ఈ ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది.

ఇక ‘మ్యాడ్, మ్యాడ్‌ 2’ వంటి ఫీచర్‌ ఫిల్మ్స్‌లో సంగీత్‌ శోభన్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటించారు. అలాగే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్‌లో హీరోగా చేశారు. కానీ ‘రాకాస’ చిత్రంలో మాత్రం సంగీత్‌ శోభన్‌ సోలో హీరోగా చేశారు. మరి... ఈ సినిమా సంగీత్‌ కెరీర్‌కు ఎంత మైలేజ్‌ ఇస్తుందన్న విషయం మరో పది రోజుల్లో తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఓ స్నేక్‌ డ్యాన్స్‌ ఉంది. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు ఈ చిత్రనిర్మాత–నటి నిహారిక కొణిదెల గెస్ట్‌ రోల్‌ చేశారని తెలిసింది. ఈ చిత్రానికి అనుదీప్‌ దేవ్‌ సంగీతం అందించారు.

తిమ్మరాజుపల్లిలో ఏం జరిగింది? 
సాయి తేజ్, వేద జలంధర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ప్రదీప్‌ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్‌ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిం చారు. 1990 కాలంలో ఈ సినిమా కథనం సాగుతుంది. తేజ వేల్పుచర్లతో కలిసి హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 17న విడుదల కానుంది. ఈ సినిమా ప్రధాన కథాంశం తిమ్మరాజుపల్లి అనే ఊరి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఆ ఊరి ప్రజలు, హీరో ప్రేమకథ, శివరాత్రి జాగారం సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు... ఇలాంటి అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందట. వంశీకాంత్‌ రేఖన ఈ చిత్రానికి సంగీతం అందించారు.

పాపం ప్రతాప్‌ 
ఇటీవలే ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు తిరువీర్‌. ఈ యంగ్‌ హీరో నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్‌’. పాయల్‌ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అజయ్‌ ఘోష్, ప్రసాద్‌ బెహరా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్‌.పి దుర్గా నరేష్‌ దర్శకత్వంలో రాకేష్‌ రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌ మాదిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 17న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో తిరువీర్, పాయల్‌ రాధాకృష్ణ భార్యాభర్తలుగా నటించారు.

అనువాద చిత్రాలూ ఉన్నాయి
కోలీవుడ్‌లో ఏప్రిల్‌లో విడుదలవుతున్న ముఖ్యమైన సినిమాల్లో ‘కర’ ఒకటి. ఈ చిత్రంలో ధనుష్‌ హీరోగా నటించగా, మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. కేఎస్‌ రవికుమార్, జయరామ్, సురాజ్‌ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విఘ్నేష్‌ రాజా దర్శకత్వం వహించారు. వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ పతాకంపై ఇషారి కె. గణేష్‌ ఈ సినిమాను నిర్మించారు. రివెంజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా ఏప్రిల్‌ 30న రిలీజ్‌ కానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి మమితా బైజు, కేఎస్‌ రవికుమార్‌ల ఫస్ట్‌ లుక్స్‌ను రిలీజ్‌ చేశారు.

‘కర’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఇక తమిళ యువ నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పత్య్రేకంగా చె΄్పాల్సిన అవసరం లేదు. ‘లవ్‌ టుడే, డ్రాగన్‌ (తెలుగులో ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’), డ్యూడ్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ప్రదీప్‌ దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరో పటించిన తాజా చిత్రం ‘ఎల్‌.ఐ.కే ’ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ). ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించారు. నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నయనతార, ఎస్‌ఎస్‌ లలిత్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 3న రిలీజ్‌ చేయాలనుకున్నారు.

కానీ ఈ సినిమా ఏప్రిల్‌ 10కి వాయిదా పడిందని టాక్‌. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. శరవణన్‌ ‘లీడర్‌’ చిత్రం కూడా ఏప్రిల్‌లోనే రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇక బాలీవుడ్‌లో వచ్చే నెల రిలీజ్‌ కానున్న సినిమా ‘భూత్‌ బంగ్లా’. అక్షయ్‌ కుమార్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ హారర్‌ సినిమాలో పరేష్‌ రావల్, రాజ్‌పాల్‌ యాదవ్, టబు, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి మంగళవారం ‘తుహీ దిస్దా’ పాటను రిలీజ్‌ చేశారు. ఈ పాటను అర్జిత్‌ సింగ్‌ పాడారు.

అక్షయ్‌ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 10న రిలీజ్‌ కానుంది. మరోవైపు మాలీవుడ్‌లో ఏప్రిల్‌ 10న ‘పళ్లి చట్టంబి’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. టొవినో థామస్, కయదు లోహర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమాకు డిజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వం వహించారు. నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్‌ నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

1950–1960 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. కన్నడలో ధ్రువ సర్జా నటించిన ‘కేడీ: ది డెవిల్‌’ సినిమా ఏప్రిల్‌ 30న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రేమ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను వెంకట్‌ కె. నారాయణ నిర్మించారు. సంజయ్‌ దత్, శిల్పా శెట్టి, వి. రామచంద్రన్‌ ఈ మూవీలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్‌ కానుంది. ఇలా వచ్చే నెల తెలుగులో రిలీజ్‌ కానున్న మరికొన్ని అనువాద సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఏప్రిల్‌లో రిలీజ్‌ కావడానికి సిద్ధం అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement