ఎట్టకేలకు.. | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు..

Nov 24 2026 11:18 AM | Updated on Nov 24 2026 11:18 AM

28 చెరువులకు రూ.9.15 కోట్లు మంజూరు

● మరమ్మతులకు మోక్షం

● 25 పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌

● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా రైతాంగం

జిల్లాలో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కట్టు కాల్వల మరమ్మతులకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు 208 నీటి వనరులు దెబ్బతినగా, వాటిలో 29 చెరువులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. మరో 179 చెరువులకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. మిగతా వాటికి రూ.10.95 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిలో 28 చెరువు, కుంటలకు ఇటీవల రూ.9.15 కోట్లు మంజూరు చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

– మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా మొత్తం 2 వేల పైచిలుకు సాగునీటి వనరులున్నాయి. కాగా, గతేడాది వానాకాలంలో కురిసిన భారీ వర్ష్లాకు 208 చెరువులు, కుంటలు, సాగునీటి కట్టు కాల్వలు దెబ్బతిన్నాయి. వాటిలో 179 చెరువు, కుంటలకు అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సి ఉండగా, రూ. 2 కోట్లతో తాత్కాలికంగా కాంట్రాక్టర్లతో పనులు చేయించారు. అయితే ఆ డబ్బులు నేటికీ విడుదల కాకపోవటంతో కాంట్రాక్టర్లు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది.

రూ.10.95 కోట్లకు ప్రతిపాదనలు

జిల్లాలో పెద్దఎత్తునదెబ్బతిన్న 29 చెరువులు, కట్టు కాలువల మరమ్మతులకు రూ. 10.95 కోట్లు అవసరమని సంబంధిత ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపింది. అయితే అందులో 28 పనులకు మాత్రమే ఇటీవల రూ. 9.15 కోట్లు మంజూరయ్యాయి. మరో చెరువుకు ఇంకా నిధులు మంజూరు కాలేదు. దీంతో ఆ 28 పనులకు సంబంధించి టెండర్‌ పిలవగా, వాటిలో 25 పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. ఈ లెక్కన మరో మూడు పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

15 నెలల తర్వాత నిధులు

దెబ్బతిన్న నీటి వనరుల మరమ్మతులకు 15 నెలల తర్వాత నిధులు మంజూరయ్యాయి. దీంతో తెగిన చెరువులు, కుంటల వెనకాల 2025 రబీ సీజన్‌లో రైతులు పంటల సాగు చేయలేకపోయాయి. దీంతో వాటికి త్వరగా మరమ్మతులు చేసి ఆదుకోవాలని జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు పలుమార్లు కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో వినతిపత్రాలు అందించారు. అలాగే నిజాం పాలనలో నిర్మించిన రాయినిపల్లి ప్రాజెక్టు కట్టు కాల్వలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈప్రాజెక్టు ద్వారా రాయిపల్లి, పాతూరు, తిమ్మనగర్‌, కోంటూర్‌, అవుసులపల్లి, గుట్టకిందిపల్లి తదితర గ్రామాల్లోని 1,400 పైచిలుకు ఎకరాలకు నీరు పారుతుంది. కాగా, కాల్వలు ధ్వంసం కావటంతో గతేడాది రబీలో ఆ ప్రాజెక్టు కింద పొలాలు బీళ్లుగా మారాయి. ఇటీవల ఈ చెరువు మరమ్మతులకు రూ.2.25 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఖజానా చెరువుపై కనికరం ఎప్పుడో!

జిల్లావ్యాప్తంగా పెద్ద మొత్తంలో డ్యామేజ్‌ అయిన నీటి వనరులు 29 కాగా, వాటిలో అవుసులపల్లికి చెందిన ఖజానా చెరువు ఒకటి. భారీ వరదలకు చెరువు కట్ట పూర్తిగా తెగిపోయింది. ప్రస్తుతం అందులో చుక్క నీరు కరువైంది. దాని మరమ్మతుల కోసం ఏకంగా రూ.1.8 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కానీ 28 నీటి వనరులకు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. ఖజానా చెరువు మరమ్మతులకు మాత్రం మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ చెరువు ఆయకట్టు కింద వంద ఎకరాలకు పైగా సాగు భూములు ఉన్నాయి. దీంతో త్వరగా మరమ్మతులు చేపట్టి ఆదుకోవాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement