అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. ప్రజావాణికి మొత్తం 62 వినతులు రాగా, వీటిలో భూ భారతి 20, ఇందిరమ్మ ఇళ్ల కోసం 8, పింఛన్లు 5, ఇతర సమస్యలపై 29 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా ఫారెస్ట్ అధికారి జోజితో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అంత్యోదయ కార్డు ఇప్పించండి
ఎవరూ లేని ఒంటరి దంపతులం. గతంలో అంత్యోదయ కార్డు ఉండేది. నెలరోజుల పాటు పూట గడిచేది. ప్రస్తుతం అంత్యోదయ కార్డు తొలగించి సాధారణ కార్డు ఇచ్చారు. దీంతో 12 కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఫలితంగా తిండిలేక అనేక అవస్థలు పడుతున్నాం. ఎలాంటి పనులు చేయలేని దీన స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలి.
– జంగం సత్తవ్వ, అక్కన్నపేట


