కొల్చారం(నర్సాపూర్): ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు, నీటి లభ్యతపై ఆందోళన నేపథ్యంలో మండలంలోని పలువురు రైతులు వరికి స్వస్తి చెప్పి ఆరుతడి పంటగా మిరప సాగుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నీటితో మెరుగైన దిగుబడి సాధించేందుకు ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తున్నారు.
నారు ఎంపిక, యాజమాన్య పద్ధతులు
35 నుంచి 45 రోజుల పాటు పెరిగిన ఆరోగ్యకరమైన నారును గుర్తించి పొలంలో నాటేందుకు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నాటిన పొలంలో సేంద్రియ ఎరువులను వినియోగించి, బిందు సేద్యం, మాల్చింగ్ పద్ధతుల ద్వారా నీటిని పొదుపు చేయవచ్చు. పంట పెరుగుదల దశలో అవసరానికి అనుగుణంగా నీరు, ఎరువులను అందించాలి. పంటను తామర పురుగులు, తెల్ల దోమ, నల్లులు, ఆకు ముడత వైరస్, వేరు కుళ్లు, ఎండు తెగులు వంటివి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. పసుపు రంగు, నీలం రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసి, వ్యవసాయాధికారుల సూచనల మేరకే పురుగు మందులను వినియోగించాలి.
మార్కెట్లో పంటకు డిమాండ్
రైతులు పచ్చిమిర్చి మొక్కలు నాటిన తర్వాత 65 నుంచి 70 రోజుల్లో మొదటి కోత (పంట) చేతికి వస్తుంది. మిరపను పచ్చిమిర్చిగా అమ్ముకుంటే అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పచ్చి మిర్చిని ఎక్కువసార్లు కోయడం వల్ల ఎకరాకు 100 నుంచి 130 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మల్చింగ్, డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తే కలుపు ఖర్చు తగ్గడమే కాకుండా, మొక్కలకు పోషకాలు నేరుగా అంది దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ స్థాయిలో పచ్చిమిర్చి కిలో రూ.60 నుంచి రూ.80 పలుకుతుంది. రైతే నేరుగా అంగట్లో అమ్మితే క్వింటాల్‌కు రూ.6 వేలు లభిస్తుంది. తద్వారా పెట్టుబడి పోను సగానికి పైగానే ఆదాయం సమకూరుతుంది.
ఎల్‌నినో నేపథ్యంలో రైతుల నిర్ణయం


