తూప్రాన్: డివిజన్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ కోర్టును మంగళవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుద్దాల చలపతిరావు ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి భవన ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. జిల్లా న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నూతన కోర్టు ప్రారంభంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సంగారెడ్డి టౌన్: జిల్లాలోని హత్నూర, పటాన్చెరు, సంగారెడ్డి ఐటీఐలతో పాటు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికిరణ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 44 మధ్య ఉండాలని, ఎంపికై న వారికి నెలకు రూ.15,600 జీతం ఉంటుందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులతో పాటు పూర్తి ధ్రువపత్రాలను జతపరచి కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
హవేళిఘణాపూర్(మెదక్): కార్మికుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి సీపీఎం సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చలో ఢిల్లీ కార్యక్రమంతో మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి సీపీఎం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, మల్లేశం, బాలమణి, మహేందర్‌రెడ్డి, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కళ్లాల్లో ధాన్యం..
కళ్లల్లో దైన్యం
అల్లాదుర్గం(మెదక్): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారుల మాటలు నీటి మూటలు గానే మిగిలాయి. ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నా కొనేవారే దిక్కులేరు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని రైతులు కల్లాలు చేసే 15 రోజులు గడిచింది. స్థానిక రైతు కేంద్రం, పాఠశాల ఆవరణలో ధాన్యం నిల్వ చేశారు. కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా అల్లాదుర్గంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం సేకరించారు. ఈసారి మాత్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. మూడేళ్ల క్రితం పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు చేశారు. వారు సైతం కేంద్రం ఏర్పాటుకు ముందుకు రాలేదు. రోజూ ధాన్యం ఆరబోస్తూ కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించే ధాన్యం కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వట్పల్లి(అందోల్): తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి అనిల్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం వట్‌పల్లిలోని సిద్ది వినాయక ధర్మకాంట వే బ్రిడ్జిని ఆయన తనిఖీ చేశారు. ఇటీవల కొనుగోలు చేసిన ధాన్యాన్ని వట్పల్లి మార్కెట్‌యార్డుకు తరలించే క్రమంలో లారీలను తూకం చేయగా ప్రతి లారీలో ధాన్యం తరుగుతో పాటు ఓ లారీలో ఏకంగా 150 సంచుల తరుగు రావడంపై రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వారి ఆదేశాల మేరకు వే బ్రిడ్జిని తనిఖీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తూకంలో తేడా లేదన్నారు. అయితే రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు వచ్చిందని చెబుతుండగా, మరోవైపు లీగల్ మెట్రాలజీ అధికారులు తూకంలో ఎటువంటి తేడాలు లేవని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సివిల్ సప్లై అధికారులు పూర్తి విచారణ జరిపి నిజా నిజాలను వెలికి తీసి న్యాయం చేయాలని రైతులకు కోరుతున్నారు.


