మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ హయాంలో పట్టణంలో సుమారు 1,200కు పైగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. అందులో సగానికి పైగా ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేశామన్నారు. అయితే మిగిలిన ఇళ్ల నిర్మాణాలు నేటికీ అసంపూర్తిగా ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే రామాయంపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా పునరుద్ధరించాలని కోరారు. గత ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కార్యాలయాలు సిద్దిపేటకు తరలిపోతాయంటూ అసత్య ప్రచారాలు చేసి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 1వ తేదీలోగా రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించకపోతే మరోసారి ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్, జితేందర్ గౌడ్, రామాయంపేట పాక్స్ చైర్మన్ చంద్రం, పుట్టి విజయలక్ష్మి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి


