● కార్మికులకు పార్టీలు, సంఘాల మద్దతు
● మెదక్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్
మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: ఆర్టీసీ సమ్మె జిల్లాలో ఉధృతమైంది. రెండో రోజు గురువారం కార్మికులు డిపోల ఎదుట ఆందోళన నిర్వహించారు. మెదక్‌లో వారికి మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టిన బీజేపీ, సీఐటీయూ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశంతో పాటు పలువురు నాయకులు, కార్మికులను బలవంతంగా డీసీఎంలో ఎక్కించి వెల్దుర్తి పీఎస్‌కు తరలించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి సమ్మెలో కూర్చొని కార్మికులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గుల్షన్ క్లబ్ నుంచి డిపో వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.
తాత్కాలిక సిబ్బంది నియామకం
రెండోరోజు జేబీఎస్, పటాన్‌చెరువు, సిద్దిపేట, బొడ్మట్‌పల్లి రూట్లలో 55 బస్సులు నడిపినట్లు మెదక్ డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. మెదక్‌లో 50 మంది కండక్టర్లు, నర్సాపూర్‌లో ఆరుగురు కండక్టర్లు, ఆరుగురు డ్రైవర్లను నియమించినట్లు చెప్పా రు. తాత్కాలిక సిబ్బందితో 6 బస్సులను పలు మార్గాల్లో నడిపించారు. డిపో వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆటో, ఇతర ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. కార్మికులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి మద్దతు ప్రకటించారు. కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


