హవేళిఘణాపూర్(మెదక్): మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపొద్దని డీఈఓ విజయ సూచించారు. గురువారం మండల పరిధిలోని కూచన్‌పల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చదివించడంతో పాటు బయటకు వెళ్లకుండా చూసి వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మధుమోహన్, ఉపాధ్యాయులు మల్లారెడ్డి, శశికుమార్, కృష్ణవేణి, గంగమణి విద్యార్థుల తల్లిదండ్రులు, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నగరం గ్రామంలో గురువారం డీఎల్పీఓ సురేశ్‌బాబు పర్యటించారు. పల్లె ప్రగతి పనులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు గ్రామంలోని నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, శ్మశానవాటిన, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీఓ రజనీకాంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ ఆరీఫ్ హుస్సేన్, చల్మెడ పంచాయతీ కార్యదర్శి వెంకట నర్సింహరెడ్డి, సర్పంచ్ అంతంపల్లి సుశీల, ఉప సర్పంచ్ నాజం, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
మెదక్ కలెక్టరేట్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లా పోలీస్‌శాఖ అప్రమత్తం అయిందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం మెదక్ ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. బందోబస్తుపై డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేశ్‌లను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు రవాణ సేవలు నిరంతరంగా కొనసాగేందుకు భద్రతా చర్యలను బలోపేతం చేసినట్లు చెప్పారు. అనంతరం డిపో మేనేజర్ సురేఖతో మాట్లాడారు. ప్రస్తుతం నడుస్తున్న బస్సుల సంఖ్య, సేవల స్థితిగతులపై ఆరా తీశారు. ప్రైవేట్ డ్రైవర్లు, సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా రవాణ కు ఆటంకం కలిగించే చర్యలు, బస్సులకు నష్టం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించబోమని హెచ్చరించారు.
కొల్చారం(నర్సాపూర్): పిచ్చికుక్క దాడిలో ఇద్దరు మహిళలు గాయపడిన సంఘటన మండలంలోని రంగంపేటలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలోని చాకలివాడలో ఇంటి ఎదుట పనిచేస్తున్న యాదమ్మ, సత్తమ్మపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. రక్తస్రావం కావడంతో స్థానికుల వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, ముందస్తు రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. సర్పంచ్ స్వర్ణలత పిచ్చికుక్కను బంధించాలని పంచాయతీ కార్మికులను ఆదేశించారు.
తూప్రాన్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని నాబార్డ్ ఏజీఎం తేజ అన్నారు. గురువారం మండలంలోని మల్కాపూర్, ఘన పూర్‌లో నాబార్డ్ ఆధ్వర్యంలో బ్యూటీ అండ్ పర్సనల్ వెల్నెస్‌పై 20 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేసుకునే మహిళలకు బ్యాంకులు ఆర్థిక సహాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం బాపూజీ, మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఎల్‌డీఓ శ్రావ్య, కోఆర్డినేటర్ టీజీ రెడ్డి, డీసీసీబీ మేనేజర్ ప్రవీణ్ గౌడ్, శిక్షకులు శ్రీవాణి, స్రవంతి పాల్గొన్నారు.


