కల్లాలు దాటని ధాన్యం | - | Sakshi
Sakshi News home page

కల్లాలు దాటని ధాన్యం

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

రైతుల్లో కలవరం

యాసంగి వరి కోతలు మొదలైనా, ఆస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. బిహారీ హమాలీలు రాక వడ్లు తూకాలకు నోచుకోవడం లేదు. ఓ వైపు అకాల వర్షాలు.. మరో వైపు ఆరబెట్టిన ధాన్యాన్ని చూస్తూ అన్నదాత గడియొక గండంగా కాలం వెళ్లదీస్తున్నాడు. జిల్లాలో 525 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో ఇప్పటివరకు కేవలం 11 మాత్రమే ప్రారంభం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. – మెదక్‌ అర్బన్‌

జిల్లాలో యాసంగికి సంబంధించి 2,69,773 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అందులో 3,75,976 మెట్రిక్‌ టన్నులు దొడ్డు రకం, 69,490 సన్న రకం కలిపి మొత్తం 4,45,466 మెట్రిక్‌ టన్ను ల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. వీటి కొనుగోలు కోసం జిల్లావ్యాప్తంగా 525 కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం 1,11,36,650 గన్నీ బ్యాగులు అవసరం ఉంది. అయితే ప్రస్తుతం 51 లక్షల గన్నీలు మాత్రమే అందుబాటులో ఉండగా, మరో 60,36,650 బస్తాలు తెప్పించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

బిహారీ.. రావోయి

కొన్నేళ్లుగా జిల్లాలో బిహారీ హమాలీలే కొనుగోలు కేంద్రాల్లో పని చేస్తున్నారు. స్థానికంగా కొంత మంది ఏజెంట్లు, అడ్వాన్స్‌లు చెల్లించి వారిని తీసుకొచ్చి హమాలీ పని చేయిస్తున్నారు. వీరికి క్వింటాల్‌కు రూ.40 చొప్పున ఇస్తూ, అందులో నుంచి రూ.2 కమిషన్‌గా తీసుకుంటారు. అయితే ఒక్కో సెంటర్‌లో సుమారు 20 నుంచి 30 మంది హమాలీలు పని చేస్తుంటారు. ఈసారి సీజన్‌ ప్రారంభమై దా దాపు 25 రోజుల కావొస్తున్నా, వారు రాలేదు. దీంతో ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. అయితే తరచూ వాన మొగులు కావడం, వడగళ్ల వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ హమాలీలుగా పని చేసిన స్థానికులు, ఇప్పుడు అటు వైపు తొంగి చూడటం లేదు.

హమాలీలు లేక సాగని కొనుగోళ్లు

జిల్లాలో కేవలం 10 సెంటర్లే ప్రారంభం

వెంటాడుతున్న అకాల వర్షాలు

యాసంగి లక్ష్యం 4.45 లక్షల మెట్రిక్‌ టన్నులు

Advertisement
 
Advertisement
Advertisement