● గతంలో కంప్యూటర్లు, ఫ్యాన్లు ఎత్తుకెళ్లిన దుండగులు
● చర్యలు చేపట్టని అధికారులు
● గతేడాది వేసవి సెలవుల్లో నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తలుపులు పగులగొట్టి దుండగులు టీవీని ఎత్తుకెళ్లారు. ఆ మరుసటి రోజు ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
● అదేవిధంగా కొల్చారం మండలం ఎనగండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3, రంగంపేట ఉన్నత పాఠశాలలోని 3 ఫ్యాన్లను ఎత్తుకెళ్లారు. ఈ విషయమై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మెదక్‌జోన్: ప్రభుత్వ పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు ఇచ్చారు. అయితే బడులు ఆస్తుల రక్షణ ప్రధాన సమస్యగా మారింది. సెలవు రోజుల్లో దుండగులు పాఠశాలల తాళాలు, తలుపులు పగులగొట్టి టీవీలు, కంప్యూటర్లు, ఫ్యాన్లు ఎత్తుకెళ్తున్నారు. కొందరు ఆకతా యిలు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత విద్యార్థులకు డిజిటల్ పాఠాలు చెప్పాలంటే మళ్లీ టీవీలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. బడ్జెట్ లేక వాటిని తిరిగి కొనుగోలు చేయడం లేదు. దీంతో విద్యార్థులు డిజిటల్ విద్యకు దూరం అవుతున్నారన్నా విమర్శలున్నాయి. అలాగే ఫ్యాన్లు ఇతర సామగ్రిని తిరిగి కొనుగోలు చేయాలంటే నానా తంటాలు పడాల్సి వస్తోంది. కొన్ని పాఠశాలల్లో వాటిని తిరిగి కొనుగోలు చేయకుండా వదిలేస్తున్నారు. ఏటా వేసవి సెలవుల్లో ఇది సర్వసాధారణంగా మారింది. అధికారులు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
ప్రత్యేక నిఘా అవసరం
వేసవి సెలవుల్లో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడాలంటే ప్రత్యేక నిఘా అవసరం. ఇందుకోసం ఆయా గ్రామాల్లోని యువత సహాయం తీసుకోవాలి. అంతేకాకుండా పోలీసులు సైతం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పాఠశాలలకు వచ్చే నిర్వహణ నిధుల నుంచి సీసీ కెమెరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో 903 ప్రభుత్వ బడులు
జిల్లావ్యాప్తంగా 903 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 601 ప్రాథమిక, 132 ప్రాథమికోన్నత, 152 ఉన్నత పాఠశాలలతో పాటు మరో 18 పాఠశాలలు పదో తరగతి నుంచి ఇంటర్ వరకు కొనసాగుతోంది. వీటిలో 62 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా 561 పాఠశాలలకు ప్రహరీలు ఉండగా, మిగితా 342 పాఠశాలలకు రక్షణ కరువైంది. ఈ విషయాన్ని గత కలెక్టర్ దృష్టికి పలువురు తీసుకెళ్లగా 3 నెలల క్రితం 183 పాఠశాలలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద ప్రహరీలకు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం వాటిని పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. ఆ నిర్మాణాలు పూర్తయితే బడులకు కొంత మేర రక్షణ ఉండనుంది.


