ఆలు ధర ఢమాల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆలు ధర ఢమాల్‌

Mar 3 2026 9:07 AM | Updated on Mar 3 2026 9:07 AM

● పెట్టుబడులు రాక తీవ్ర ఆందోళన ● బోనస్‌ ఇవ్వాలని రైతుల డిమాండ్‌

మార్కెట్లో లభించని గిట్టుబాటు

జహీరాబాద్‌: ఆలుగడ్డ పంటను సాగు చేసుకున్న రైతుల నోట్లో మట్టిపెల్ల పడుతోంది. మార్కెట్‌లో ఏ మాత్రం గిట్టుబాటు ధరలు లేక పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎకరా పంటపై రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో క్వింటా ధర రూ.500 నుంచి రూ.600 మాత్రమే పలుకుతోంది. కాగా, ఈ ధరకు పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేదంటున్నారు. జిల్లాలోని జహీరాబాద్‌ ప్రాంతంలోనే ఆలుగడ్డ పంట 90 శాతం వరకు సాగవుతుంది. ఈ ఏడాది జిల్లాలో 6వేల ఎకరాల్లో పంట సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. క్వింటా విత్తనానికి రూ.4వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు రైతులు.. 8 క్వింటాళ్ల మేర విత్తనం నాటుకున్నారు. ఈ లెక్కన కేవలం విత్తనానికే రూ.32వేలు, ఇతరు పెట్టుబడులకు మరో రూ.50వేల మేర ఖర్చు చేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. అయితే క్వింటా రూ.1,200 పలికితేనే గిట్టుబాటవుతుందని రైతులు చెబుతున్నారు.

మార్కెట్‌కు పోటెత్తిన పంట

మార్కెట్‌కు అధికంగా పంట రావడంతో గిట్టుబాటు ధర లభించలేదని అంటున్నారు. గతంలో జహీరాబాద్‌ ప్రాంతంలో మాత్రమే అధికంగా సాగవుతుండగా.. ప్రస్తుతం ఇతర జిల్లాలకు విస్తరించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సైతం ఉత్పత్తులు వస్తున్నాయి. ఇందూర్‌, వికారాబాద్‌ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని మార్కెట్లకు అధికంగా ఉత్పత్తులు రావడంతో ధర పూర్తిగా పడిపోయేందుకు కారణమవుతోందని రైతులు వాపోతున్నారు. నవంబర్‌ నుంచి ఆలుగడ్డ పంట చేతికి అందకపోవడంతో ఆగ్రా ప్రాంతం నుంచి ఉత్పత్తులు దిగుమతి కావడం, ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి రావడంతో మార్కెట్‌లో ధర లభించకుండా పోయింది. దీంతో ధర పెరుగుతుందేమోనని కొంతమంది రైతులు పంటను భూమిలోనే ఉంచారు. కాగా, ఆలుగడ్డ పంటకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. పంటను సాగు చేసిన రైతులకు వరికి ఇచ్చిన మాదిరిగానే క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement