● వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సన్నాహాలు
● ఇందుకోసం రూ. 57 కోట్లు మంజూరు
మెదక్‌జోన్: వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరగనున్న నేపథ్యంలో జిల్లాలో అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా, రూ. 57 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో ఇప్పటికే 124 సబ్‌స్టేషన్లు ఉండగా, నూతనంగా మరో 8 సబ్‌స్టేషన్లు నిర్మించారు. ఇవికాకుండా గత వానాకాలంలో పట్టణ పరిధి పుష్పాలవాగు సమీపంలోని సబ్‌స్టేషన్ నీటి మునిగిపోగా, దానిని మరో చోట నిర్మించారు. ఇందుకోసం అదనంగా మరో రూ. 3.50 కోట్లు ఖర్చు చేశారు.
9 చోట్ల ఓవర్‌లోడ్
జిల్లాలో తొమ్మిది ప్రాంతాల్లో ఎక్కువగా ఓవర్‌లోడ్ అవుతున్నట్లు గుర్తించారు. వీటి పరిధిలో ఏడు 33 కేవీ సబ్‌స్టేషన్లలో లైన్‌వర్క్‌లు, ఇంటర్నల్ లింకులు ఇచ్చారు. గాలి దుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ఇతర కారణాలతో అంతరాయం ఏర్పడితే మరో లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. నూతనంగా 200 పైచిలుకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఐదు టీఆర్ సెంటర్లు
జిల్లావ్యాప్తంగా 5 ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ (టీఆర్) సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం వేసవిలో విద్యుత్ విని యోగం పెరగటంతో ఓవర్‌లోడ్, ఇతర సమస్యలతో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే జిల్లాలోని మెదక్, పాపన్నపేట, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేటలోని టీఆర్ సెంటర్లకు తరలించి మరమ్మతులు చేయనున్నారు. కాగా వ్యవసాయ బోరు బావుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే 48 గంటల్లో రిపేర్ చేసి రైతులకు ఇవ్వాల్సి ఉండగా, అదే గృహ అవసరాలకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మ ర్ కాలిపోతే కేవలం 24 గంటల్లో రిపేర్ చేసి ఇస్తారు. ఇదే విషయమై విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నారాయణనాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ వినియోగం ఇప్పటికే గణనీయంగా పెరిగిందని, వచ్చే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, పరిశ్రమల్లో అవసరం మేరకే కరెంట్ వాడాలని సూచించారు. ఈనెలలో రోజుకు 572 మెగావాట్ల విద్యుత్ ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు.


