చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలంలోని నర్సంపల్లిలో మద్యపాన నిషేధం విధించారు. ఈమేరకు సోమవారం సర్పంచ్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో తీర్మానించారు. అ నంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఈనెల 5 నుంచి గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించవద్దని చెప్పారు. ఒక వేల గ్రామసభ తీర్మానం ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.1 లక్ష జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అలాగే మద్యం విక్రయిస్తుండగా, పట్టిస్తే రూ. 25 వేల నజరానా అందించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ బాల్‌రాజ్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ రఫీ పాల్గొన్నారు.


