సమస్యలు ఇలా..
అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: మూడు నెలల అనంతరం ప్రారంభమైన ప్రజావాణికి సోమవారం ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ తమ సమస్యలపై వినతులు సమర్పించి పరిష్కరించాలని నూతన కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు మొర పెట్టుకున్నారు. సావధానంగా విన్న కలెక్టర్ ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణికి మొత్తం 74 వినతులు రాగా, ఇందులో అత్యధికంగా భూ సమస్యలు, పెన్షన్లు ఉన్నాయి. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తమ పనితీరును మరింత మెరుగు పర్చుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అనంతరం టీజీఓ, జిల్లా టీజీఆర్‌ఎస్‌ఏ సంఘాల నాయకులు కలెక్టర్‌ను వేర్వేరుగా కలిసి సన్మానించారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏఓ యూనస్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అమెరికాలో నివాసం ఉండే ఓ వ్యక్తి మా భూమిని కబ్జా చేసి.. అందులోకి వస్తే చంపుతానని బెదిరిస్తున్నాడని కుషన్‌గడ్డ తండాకు చెందిన గిరిజనులు ఫిర్యాదు అందించారు.
కొడుకుకు రెండెకరాలు ఇచ్చినా, అన్నం పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని రామచంద్రాపురం గ్రామానికి చెందిన మల్లయ్య కలెక్టర్‌ను కలిసి వివరించారు.
కొడుకులు లేరని కూతురును ఇళ్లరికం పెట్టుకున్నా. 4 ఎకరాలు ఆమె పేరుపై పట్టా చేశా. ప్రస్తుతం తనను కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లగొడుతుందని యశ్వంతరావుపేటకు చెందిన ఆండాలమ్మ ఫిర్యాదు చేసింది.


