కౌంట్‌డౌన్
మెదక్‌జోన్/రామాయంపేట/నర్సాపూర్/తూప్రాన్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను లెక్కిస్తారు. కాగా ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని నాలుగు బల్దియాల్లో 74 వార్డులకు ఎన్నికలు జరగగా, కౌంటింగ్ కేంద్రాలను ఆయా మున్సిపాలిటీల్లోనే ఏర్పాటు చేశారు. మెదక్‌కు సంబంధించి వెస్లీ కాలేజీ, నర్సాపూర్ ఓట్ల లెక్కింపు బీవీఆర్‌ఐటీ, తూప్రా న్ ఓట్ల లెక్కింపు నోబెల్ డైట్ ఫార్మసీ కాలేజీ, రామాయంపేట లెక్కింపు ప్రక్రియ ఎంపీడీఓ కార్యాలయంలో జరగనుంది.
మూడు రౌండ్లు.. 26 టేబుళ్లు
మెదక్ మున్సిపాలిటీని 31 వార్డులను 11 టేబుళ్ల ద్వారా లెక్కించనున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులలో 16,876 మంది ఓటర్లు ఉండగా, 13,266 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో 15 వార్డులున్నందున, మూడు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. మొదటి రౌండ్‌లో 1, 4, 7, 10, 13 వార్డుల ఓట్లు లెక్కిస్తారు. రెండో రౌండ్‌లో 2, 5, 8, 11, 14 వార్డులు, మూడో రౌండ్‌లో 3, 6, 9, 12,15 వార్డుల ఓట్లు లెక్కించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చారు. రామాయంపేటలో మొత్తం 13,095 ఓటర్లకు గాను 11,110 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 12 వార్డులకు సంబంధించి 4 టేబుళ్లు ఏర్పాటు చేయ గా, మూడు రౌండ్లలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గానూ 6 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కాగా ఒక్కో టేబుల్‌కు మొత్తం ఐదు గురి అధికారులతో కలిపి మొత్తం 26 టేబుళ్లకు 130 మంది అధికారులను కేటాయించారు. కా గా 25 ఓట్ల చొప్పున బండిల్స్‌ను కట్టి ఓట్లను లెక్కించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటల
వరకు ఫలితాలు
ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తవుతుందని అధికారు లు అంచనా వేస్తున్నారు. కాగా ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
సర్వత్రా అలుముకున్న ఉత్కంఠ


