ప్చ్‌.. గెలుపు అడ్డం తిరిగింది | - | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. గెలుపు అడ్డం తిరిగింది

Feb 14 2026 9:09 AM | Updated on Feb 14 2026 9:09 AM

ప్చ్‌

ప్చ్‌.. గెలుపు అడ్డం తిరిగింది

చిన్న వయసు.. పెద్ద బాధ్యత

మెదక్‌అర్బన్‌: పుర ఎన్నికల్లో పోటీ చేసిన పాతికేళ్ల యువతి భారీ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో పట్టణంలోని 28వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన బొడికె అఖిల విజయం సాధించారు. కాగా 32 మంది కౌన్సిల్‌ సభ్యుల్లో అతిపిన్న వయస్కురాలు ఆమె. బీఫార్మసీ పూర్తి చేసిన అఖిల.. భర్త భరత్‌ ప్రోత్సాహంతో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.

మోదం.. ఖేదం

మెదక్‌అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఈసారి చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. గెలుపుపై ఆశతో ఒకే కు టుంబీకులు.. బంధుమిత్రులు నానా తంటాలు పడి టికెట్లు సాధించుకొని ఎన్నికల బరిలో నిలిచారు. చివరకు ఓటర్లు కొందరికి మోదాన్ని, మరికొంత మందికి ఖేదాన్ని మిగిలిస్తూ తమ తీర్పునిచ్చారు. మచ్చుకు కొన్ని.. ఇద్దరు తోటికోడళ్లు పోటీలో నిలవగా, 7వ వార్డు నుంచి బరిలో నిలిచిన మాయ అనురాధ పరాజయం పాలవగా, 8వ వార్డు నుంచి పోటీ చేసిన మాయ గంగమణి విజయం సాధించారు. మరో కుటుంబానికి చెందిన తల్లీ బట్టి లలిత 17వ వార్డు నుంచి పోటీ చేసి ఓడిపోగా ఆమె కొడుకు బట్టి ఉదయ్‌ 29వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 20, 29వ వార్డుల నుంచి బాబాయ్‌, అబ్బాయిలు బొద్దుల కృష్ణ, నవీన్‌ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అలాగే 3, 4వ వార్డుల్లో బరిలో దిగిన వదిన–మరదలు కొట్టాల లలిత, ధర్మశెట్టి స్వరూప విజయం సాధించారు.

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మెదక్‌ మున్సిపల్‌ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్‌ నాయకులు పరాజయం పాలుకాగా, కొత్తగా రాజకీయ ఆరంగేట్రం చేసిన అభ్యర్థులు అనూహ్య విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌లో చైర్‌పర్సన్‌ పదవిపై ఆశతో బరిలోకి దిగిన ముఖ్య నేతలు ఓటమి చెందగా.. కాంగ్రెస్‌లో పీఠం ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు విజయం సాధించడంతో బహు ముఖ పోటీ ఏర్పడింది. కాంగ్రెస్‌లో ఇమడ లేక చైర్మన్‌ పదవిని ఆశించి ఇటీవలే బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఓ సీనియర్‌ నాయకుడు తన సతీమణిని బరిలో నిలిపారు. అలాగే ఇద్దరు మాజీ చైర్మన్లు తమ సతీమణులను చైర్మన్‌ ఆశతో పోటీ చేయించారు. కాగా ఈ ముగ్గురు మహిళలు అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. బీఆర్‌ఎస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ దగ్గరగా ఉన్నప్పటికీ చైర్మన్‌ అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ పార్టీలో బహుముఖ పోటీ

ఇక అధికార కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువ మంది గెలుపొందడంతో చైర్మన్‌ పదవిపై పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేతకు నమ్మిన బంటుగా ఉన్న ఓ మాజీ కౌన్సిలర్‌ ఎన్నికల ముందు అనూహ్యంగా పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరాడు. పుర పీఠాన్ని ఆశించి తన కోడలును పోటీలో దించాడు. గతంలో పలుమార్లు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమి పాలైన ఓ నాయకుడు ఈసారి చైర్మన్‌ పదవిని ఆశిస్తూ తన సతీమణిని రంగంలోకి దించాడు. అలాగే ఇప్పటికే సిట్టింగ్‌ కౌన్సిలర్‌గా ఉన్న తల్లీతో పాటు కుమారుడు ఇద్దరు విజయం సాధించారు. మరో ప్రభుత్వ ఉద్యోగి చైర్మన్‌ పదవిపై ఆశతో తన సతీమణిని పోటీలో దింపి ఒకే ఒక ఓటుతో విజయం సాధించారు. ఇలా అధికార పార్టీలో పీఠం కోసం బహుముఖ పోటీ ఏర్పడింది.

ప్చ్‌.. గెలుపు అడ్డం తిరిగింది1
1/1

ప్చ్‌.. గెలుపు అడ్డం తిరిగింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement