ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి రాందాస్ చౌరస్తా వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వీబీజీ–రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్‌ఐసీలో వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను రద్దు చేయాలన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసి కేంద్రం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు మేలు చేస్తుందని విమర్శించారు. ఇది రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు దేవయ్య, యశోద, దుర్గా, యాదగిరి, హమాలీ, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ


