బోర్లు.. బావులు.. చెరువులు
● పక్కాగా సాగు నీటి వనరుల లెక్క
● మరో రెండు రోజుల్లో పూర్తి కానున్న సర్వే
రేగోడ్(మెదక్): ఏ ఏ గ్రామాల్లో ఎన్ని నీటి వనరులు ఉన్నాయి.. వాటి కింద ఎన్ని ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయనే పక్కా లెక్క కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సర్వే చేపట్టింది. వ్యవసాయ బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల సమగ్ర సమాచారం జిల్లాలోని ఆయాశాఖల అధికారులు సేకరిస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల్లోని 380 రెవెన్యూ గ్రామాల్లో గత నెల మొదటి వారం నుంచి పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలు, జీపీఓలు గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయడంతో పాటు జియో ట్యాగ్ చేస్తున్నారు. మొత్తం 34 రకాల అంశాలపై సమాచారం సేకరిస్తుండగా, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలకు రెండోసారి, బోర్లు, బావులకు ఏడో సారి సర్వే చేస్తున్నారు. గతంలో చేసిన సర్వే ప్రకా రం జిల్లాలో మొత్తంగా బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు కలిపి 74,217 ఉన్నాయి. వాటిలో 55,258 నీటి వనరులకు సర్వే (74.5%) పూర్తి చేశారు. కాగా సర్వే ఈనెల 10వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఏఎస్‌ఓ రమేశ్ తెలిపారు.


