కంటి దీపాలకు కనుచూపెవరు? | - | Sakshi
Sakshi News home page

కంటి దీపాలకు కనుచూపెవరు?

Mar 24 2025 7:03 AM | Updated on Mar 24 2025 7:02 AM

సుగుణమ్మ ముగ్గురు కుమారులూ అంధులే

● చిన్న కొడుకు నీటి గుంతలో పడి మృతి

● ఇంటి పెద్దను కాటేసిన కేన్సర్‌

● అంధులైన కొడుకులకు పిల్లనివ్వని దైన్యం

● నేను కనుమూస్తే నా బిడ్డలకు దిక్కెవరు?

● తల్లడిల్లుతున్న మాతృమూర్తి

మెదక్‌జోన్‌: ‘పెళ్లయిన మూడేళ్లకు మొదటి సంతానంలో కొడుకు పుట్టాడని ఆనందపడ్డాం. విశ్వనాథం అని కాశీ విశ్వనాథుడి పేరు పెట్టుకున్నాం. బుడిబుడి అడుగులు వేస్తుంటే సంబరపడ్డాం. కానీ.. మా సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మా కుమారుడికి కళ్లు కనిపించవని వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. వరుసగా మరో ఇద్దరు కొడుకులకు సైతం అంధత్వం రావటంతో మా తలరాత ఇంతే అని సరిపెట్టుకున్నాం. చిన్నపాటి హోటల్‌ నడుపుకుంటూ పిల్లలను సాదుకుంటుండగా.. విధి పగ బట్టినట్లుగా కేన్సర్‌ మహమ్మారి నా భర్తను కాటేసింది. ఐదేళ్లకు చిన్నకొడుకు నీటి గుంతలో పడి మరణించాడు. దీంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. ఉన్న ఇద్దరితో ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. నేను పోయాక నా బిడ్డలను ఎవరు చూస్తారో..? తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు’అని ఎనిమిది పదుల వయసులో సుగుణమ్మ ఆందోళన చెందుతుంది.

ఎన్నో ఆస్పత్రులు తిరిగినా..

మెదక్‌ పట్టణానికి చెందిన కందుకూరి కృష్ణ, సుగుణమ్మ దంపతులకు ముగ్గురు మగ సంతానం. పెద్ద కొడుకు విశ్వనాథం, రెండో కొడుకు సంతో ష్‌, చిన్న కొడుకు రాము.. పుట్టిన ముగ్గురు అంధులే కావటంతో తమ బిడ్డల భవిష్యత్‌ కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌, సరోజినిదేవి, చైన్నెలోని శంకర్‌ నేత్రాలయం లాంటి ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆశలు వదులుకొని పట్టణంలో చిన్నపాటి హోటల్‌ ఏర్పాటుచేసి జీవనం సాగించారు. కుటుంబం సాఫీగా సాగుతున్న తరుణంలో.. 2009లో ఇంటి పెద్ద కృష్ణకు కేన్సర్‌ సోకింది. ఎలాగైనా బతకాలని.. తనకేమైనా జరగరానిది జరిగితే అంధులైన తన బిడ్డల భవిష్యత్‌ ఏంటని ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అయినా ఫలితం లేకపోవటంతో కృష్ణ మరణించాడు. దీంతో కుటుంబ బాధ్యత పూర్తిగా సుగుణమ్మపై పడింది. ఉన్న హోటల్‌ను నడపలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి కిరాణం నడుపుకుంటూ జీవిస్తుండగా.. 2014లో చిన్నకొడుకు రాము ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి స్నేహితుల సహాయంతో వెళ్లాడు. అక్కడ బహిర్భూమికి వెళ్లి నీటి గుంతలో పడి మరణించాడు.

పింఛనే పెద్ద ఆసరా

ఉన్న ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పెన్షన్‌తో సాదుకుంటోంది సుగుణమ్మ. ప్రస్తుతం ఆమెకు వృద్ధాప్యం మీద పడుతోంది. వయసు 80 ఏళ్లు. శరీరం సహకరించకున్నా అతికష్టం మీద వారికి వంట చేసి పెడుతోంది. తన తదనంతరం బిడ్డల పరిస్థితి ఏంటని మనోవేదనకు గురవుతోంది. తన పెద్ద కొడుకు విశ్వనాథంకు 40 ఏళ్లు ఉండగా.. పెళ్లి చేయాలని ఎంతగానో ఆరాట పడుతోంది. కానీ అంధులైన ఆమె కొడుకులకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. మా నాన్న అతికష్టం మీద పదో తరగతి వరకు చదివించారని.. ప్రస్తుతం జీవనోపాధి కష్టంగా మారింది.. చిన్నపాటి అటెండర్‌ ఉద్యోగం ఇప్పించి జీవనోపాధి కల్పించాలని కొడుకు విశ్వనాథం వేడుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement