
భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ రాజగోపాల్‌రావు
మనోహరాబాద్(తూప్రాన్): భద్రతా ప్రమాణాలు పాటించినప్పుడే పరిశ్రమలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ రాజగోపాల్‌రావు అన్నారు. గురువారం మండలంలోని రంగాయపల్లి ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో నిర్వహించిన జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లక్ష్మీకుమారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కార్మికులు, పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికుల రక్షణ బాధ్యత పరిశ్రమలపై ఉందన్నారు. భద్రత ముందు ఉత్పత్తి తర్వాత అనేది గుర్తుంచుకోవాలని సూచించారు. పరిశ్రమలతో స్థానికులకు ఉపాధితో పాటు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. కార్యక్రమంలో పరిశ్రమల ప్రతినిధి వసంతకుమార్, చక్రవర్తి నర్సింహం పాల్గొన్నారు.