ఐదేళ్ల కూతురితోసహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య..
తన కొడుకును బాగా చూసుకోవాలని అక్కకు ఫోన్
దండేపల్లి మండలం లింగాపూర్‌లో తీవ్ర విషాదం..
దండేపల్లి: ఆమెకు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరి దాంపత్యానికి గుర్తుగా ముద్దులొలికే ఇద్దరు పిల్ల లు జన్మించారు. ఏం జరిగిందో ఏమో కానీ మూడేళ్లుగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్తతో కలిసి ఉండలేక ఆ మహిళ పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చింది. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. భర్త కూడా అప్పుడప్పుడు అత్తవారింటికి వచ్చి భార్య, పిల్లలను చూసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ, ఆదివారం భర్త వచ్చిన కాసేపటికే ఆ మహిళ తన కూతురుతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన దండేపల్లి మండలం లింగాపూర్‌లో చోటు చేసుకుంది.
కష్టాల మధ్య జీవితం..
లింగాపూర్‌గ్రామానికి చెందిన రజిత (26)కు ఏడేళ్ల క్రితం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో వివాహమైంది. వారికి అక్షిత(5), మూడేళ్ల బాబు ఉన్నాడు. అంజయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం నుంచి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో రజిత తన పుట్టింటికి వచ్చింది.
భర్త వచ్చి వెళ్లాక..
ఆదివారం రజిత పనులకు వెళ్లకుండా పిల్లలతో ఇంట్లోనే ఉంది. రజిత తల్లిదండ్రులు లచ్చవ్వ, లచ్చన్న ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భర్త అంజయ్య రజిత వద్దకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలి యదు. సాయంత్రం భర్త వెళ్లిపోగానే.. రజిత క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. తన కుమారుడిని పక్కింట్లో అప్పగించి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లింది. ఈ క్రమంలో రజిత తల్లిదండ్రులు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చారు. కూతురు, మనుమరాలు కనిపించకపోవడంతో పక్కింట్లో ఆరా తీశారు. అక్కడ మనుమడు ఉండగా, రజిత మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిందని తెలుసుకున్నారు. అప్పటికే అనుమానంతో తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు.
అక్కా.. నా కొడుకు పైలం..
ఈ క్రమంలో రజిత కూతురు అక్షితను తీసుకుని ఇంటి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. జన్నారం మండలం మందపల్లిలో ఉంటున్న తన సోదరి మమతకు ఫోన్ చేసింది. ‘అక్కా.. నా కొడుకు జాగ్రత్త.. నా కొడుకును బాగా చూసుకో.. ఇక నేను ఉంటలేను’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత అక్షితను తన కొంగుతో నడుముకు కట్టుకుని బావిలో దూకింది. మమత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో వారు వ్యవసాయ బావివద్దకు వెళ్లి చూడగా, అప్పటికే విగత జీవులుగా నీటిపై తేలుతూ కనిపించారు. దీంతో తల్లిదండ్రులు ఎంత పనిచేసినవ్ బిడ్డా.. నీకు ఏం కష్టమొచ్చింది తల్లీ.. అంటూ బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజవర్ధన్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. పంచనామా అనంతరం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి–కూతురు మరణానికి కుటుంబ కలహాలే కారణమా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


