బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. బుధవారం 10.30గంటలకు లక్కీడ్రా నిర్వహణకు అధికార యంత్రాంగం పద్మశాలి భవన్‌లో ఏర్పాట్లు చేసింది. 2017 జూన్ 10న అప్పటి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరై రూ.968లక్షల అంచనా వ్యయంతో 160 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఏళ్లు గడిస్తే గానీ నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇందుకు అనేక కారణాలు తోడయ్యాయి. 106 ఇళ్లకు గాను పట్టణ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి 468మందిని అర్హులుగా రెవెన్యూ అధికారులు తేల్చారు. వీరి పేర్లను డ్రా తీసి ఇళ్లు అప్పగిస్తారు. ఎట్టకేలకు లక్కీ డ్రా తీయనుండడంతో లబ్ధిదారుల్లో ఆశలు, ఆసక్తితోపాటు ఉత్కంఠగా మారింది.
వీడియో చిత్రీకరణ
ఇళ్ల కేటాయింపులో అక్రమాలు, అవకతవకలు అనే ఆరోపణలకు తావివ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహించి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తారు. ఇళ్లు మంజూరు చేయిస్తామని ఇప్పటికే పలువురు దళారులు, చోటామోటా నాయకులు లబ్ధిదారులకు ఆశలు కల్పించి డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూశాయి. కొందరు నేరుగా, మరికొందరు మధ్యవర్తులు, దళారుల ద్వారా డబ్బులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఇంటికి రూ.3లక్షలు వసూలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడం అప్పట్లో దుమారం రేపింది. ఈ క్రమంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు రాకుండా వీడియోగ్రఫీ సమక్షంలో అర్హులైన లబ్ధిదారుల పేర్లను డబ్బాలో వేసి డ్రా తీయాలని నిర్ణయించారు.
అందరి సమక్షంలో డ్రా తీస్తాం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను వడబోసి జల్లెడ పట్టాం. నిజమైన లబ్ధిదారులను సర్వే చేసి గుర్తించి తుది అర్హుల జాబితా తయారు చేశాం. 496 మంది అర్హులను గుర్తించి వీరి పేర్లను డ్రాలో వేసి ఎవరి పేరైతే వస్తుందో ఆ లబ్ధిదారుకు ఇళ్లు కేటాయించడం జరుగుతుంది. లక్కీడ్రా పారదర్శకంగా వీడియోగ్రఫీ సమక్షంలో జరుగుతుంది. – ఎల్.కృష్ణ, తహశీల్దార్, బెల్లంపల్లి


