ఆర్టీసీలో ‘బ్రీత్’ వివాదం
మంచిర్యాలఅర్బన్: భద్రత దృష్ట్యా ఆర్టీసీలో నిర్వహిస్తున్న బ్రీత్ అనలైజర్ పరీక్ష వివాదాస్పదమైంది. ఒకరికి ఒకలా.. మరొకరికి మరోలా పరీక్షలు నిర్వహిస్తుండడం ఉద్యోగుల ఆందోళనకు దారితీసింది. మంచిర్యాల డిపోలో వారం రోజుల్లో ముగ్గురు కార్మికులకు పరీక్షలు నిర్వహించగా ఒక్కొక్కరికి ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం తెల్లవారుజామున కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. ఆల్కాహాల్ పరీక్షలో తమపై వివక్ష చూపారని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాయమల్లు తన కుటుంబ సభ్యులతో గేట్ ఎదుట బైఠాయించారు. ఆయనకు కార్మికులు సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు రోజు అద్దె బస్సు డ్రైవర్‌కు పరీక్షలు నిర్వహించగా మొదట, రెండోసారి మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో విధుల నుంచి పక్కనబెట్టారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో రాయమల్లు అనే కార్మికుడికి రీడింగ్‌లో నిర్ధేశించినదానికంటే ఎక్కువ వచ్చింది. రెండోసారి పరీక్షలు నిర్వహించకపోవడంపై తప్పుబట్టారు. ఇదే డిపోలో శనివారం రాత్రి విధులకు వచ్చిన ఓ ఉద్యోగి మద్యం తాగినట్లు నిర్ధారణ కావడం, రెండోసారి పరీక్షల్లో జీరో వచ్చినట్లు తేల్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుడు రెండోసారి కోరినప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయడం, వీడియో రికార్డు చేయాల్సి ఉంటుంది. రెండు నుంచి ఐదు నిమిషాల్లోపు పరీక్షలు ముగించాల్సి ఉంది. మొదటి పరీక్షలో వచ్చిన రీడింగ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా రెండోసారి పరీక్షల నిర్వహణలో నిబంధనలు పక్కనబెట్టడం చర్చనీయాంశంమైంది. డిపో స్థాయి అధికారికి కూడా ఆల్కాహాల్ పరీక్ష నిర్వహించిన ఉద్యోగి సమాచారం ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పరీక్ష ఇలా..
ఆర్టీసీ సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగం సంస్థలో కీలకమైంది. ప్రయాణికులు, ఉద్యోగుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ నుంచి ఉద్యోగుల పనితీరు పర్యవేక్షించడం, అక్రమాలు, తప్పులు గుర్తించడం బాధ్యత, డ్రైవర్లకు ఆల్కాహాల్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఉద్యోగి డ్యూటీకి వెళ్లే ముందు, అనుమానం వచ్చినప్పుడు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహిస్తారు. జీరో నుంచి 30 ఎంజీలోపు రీడింగ్ వచ్చిన వారికి మినహయింపు ఉంటుంది. ప్రతీ పరీక్షను రిజష్టర్‌లో నమోదు చేయాలి. తేదీ, సమయం, ఉద్యోగి పేరు, రీడింగ్ స్పష్టంగా ఉండాలి. అవసరమైతే డిజిటల్ రికార్డు, వీడియో తీయాలి. పాజిటివ్ వస్తే విధుల నుంచి తప్పిస్తారు. షోకాజ్ నోటీస్ ఇచ్చి నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపడుతారు. రెండ్రోజుల్లో నిర్వహించిన మొదటిసారి పరీక్షల్లో ఇద్దరికి నిర్ధేశిత రీడింగ్ కంటే ఎక్కువ 50కుపైగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరికి రెండోసారి పరీక్షలు నిర్వహించకపోగా.. మరొకరికి మాత్రం ఐదు నిమిషాలు దాటిన తర్వాత నిర్వహించడం ఏమిటనేది అధికారులే తేల్చాల్సి ఉంది.
తప్పిదమేదైనా ఉద్యోగిపై
చర్యలేనా..?
బ్రీత్ అనలైజర్ పరీక్షలు ప్రాథమిక పరీక్ష మాత్రమే. పరికరంలో సాంకేతిక లోపం వల్ల పొరపాట్లు జరిగే వీలుంటుంది. యంత్రాన్ని సమయానికి సరిచేయకపోతే తప్పు రీడింగ్ వస్తుందని చెబుతున్నారు. గాలి బలంగా, సరైన విధంగా ఊదకపోతే ఫలితం మారుతుంది. ముందుగా వాడిన మౌల్‌పీస్ వల్ల తప్పులు రావొచ్చు. సెన్సార్ సమస్యలు, బ్యాటరీ లోపంతో పరీక్షల్లో తేడా కనిపించవచ్చు. ఆర్టీసీలో బ్రీత్ అనలైజర్‌లో మద్యం తాగినట్లు నిరూపితమైతే కారణం ఏదైనా ఉద్యోగిపై చర్యలు తప్పడం లేదు. పరికరంలో తేడా ఉందా..? లేదా గమనించకుండా ఉద్యోగిపై వేటు పడుతుంది. ఒకసారి తప్పు.. రెండోసారి రైట్ వచ్చిందంటే లోపం ఉన్నట్లే కదా..? మిషన్ ఎందుకు పక్కనబెట్టడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మెడికల్ రిపోర్టు తర్వాతే తుది చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆర్టీసీలో అందుకు భిన్నంగా సాగుతోంది. బ్రీత్ అనలైజర్ పరీక్ష ఫైనల్ కాకుండా మెడికల్ టెస్ట్‌కు పంపించిన తర్వాతే చర్యలు చేపడితే బాగుంటుందని కార్మికులు కోరుతున్నారు.


