గీత దాటితే వేటే..!
● పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి
● ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ● రాజకీయ పార్టీ, పోటీ చేసే అభ్యర్థి ఉద్రిక్త పరిస్థితులను పెంచేందుకు ప్రయత్నించడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమాల్లో పాలుపంచుకోవద్దు.
● జాతి, మతం, కులం పేరుతో ఓట్లు అడగొద్దు.
● ఎన్నికల ప్రచారానికి దేవాలయాలు, మసీదులు, చర్చీలను వేదికలు చేసుకోవద్దు.
● పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలు కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు.
● విపక్ష పార్టీల అభ్యర్థుల నివాసాల వద్ద వారి అభిప్రాయాలు కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయవద్దు.
● ఇంటి యజమానుల అనుమతి లేకుండా జెండాలు కట్టడం, గోడలపై పోస్టర్లు అతికించడం, ప్రచార రాతలు రాయడం చేయవద్దు.
● ప్రింటింగ్ ప్రెస్, పేరు, చిరునామా లేకుండా పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు ముద్రించవద్దు.
● రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించేందుకు సంబంధిత అధికారి వద్ద ముందస్తు అనుమతి తీసుకోవాలి.
● ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే లౌడ్ స్పీకర్లను వాడాలి. ప్రచార సమయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి తీసుకోవాలి.
ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఏ పార్టీకి గానీ, వ్యక్తులకు గానీ అనుకూలంగా లేక వ్యతిరేకంగా పనిచేయొద్దు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దు.
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రైవేటు కార్యక్రమాల్లో, విందుల్లో పాల్గొనవద్దు.
ప్రభుత్వ ధనాన్ని సభలు, సమావేశాలకు వినియోగించవద్దు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, వాహనాలను వినియోగించవద్దు.
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో డేగకళ్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఎన్నికల విధుల్లో ఉండే అధికార యంత్రాంగం, సిబ్బంది అందరూ ప్రవర్తనా నియమావళి అనుసరించాల్సిందే. ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి