రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బెల్లంపల్లి: రైల్వే కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ ఎస్.నాగరాజు, సెక్రెటరీ జి.సాంబశివుడు, కోశాధికారి షాకిన్ మీనా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అఖిల భారత కోర్కెల దినం పాటించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లోని ఆర్‌ఓహెచ్ డిపో, ఇంజనీరింగ్, లోకో పైలెట్ డిపార్ట్‌మెంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిదో వేతన సంఘం సిఫారసులను ప్రస్తుత ఏడాది జనవరి 1 నుంచి అందరు ఉద్యోగులు, పింఛన్‌దారులకు అమలు చేయాలని తెలిపారు. ట్రాక్ మెయింటనర్లకు రూ.4,200 గ్రేడ్ పే మంజూరు చేయాలని, డైరెక్టు రిక్రూట్‌మెంట్ కోటాలోని 10శాతం పోస్టులను ఎల్‌డీసీఈకి కేటాయించాలని పేర్కొన్నారు. రైల్వేలోని పలు విభాగాల్లో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్, సీఎండబ్ల్యూ షెడ్ కార్మికులు, లోకో పైలెట్లు, పలు విభాగాల కార్మికులు, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


