కాంగ్రెస్ పార్టీకి జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాజీనామా
చెన్నూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజల్లో వ్యతిరేక భావం నెలకొందని, ప్రజాభీష్టం మేరకు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ప్రకటించారు. శనివారం చెన్నూర్‌లోని తన స్వగృహంలో రాజీనామా లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు, చెన్నూర్ నియోజకవర్గ మేనిఫెస్టోకు ఆకర్షితుడినై అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి వివేక్‌వెంకటస్వామి గెలుపునకు కృషి చేసినట్లు చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి తీవ్ర ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీలో ఒంటెద్దు పోకడ, ఏకపక్ష నిర్ణయాలు, నియంత పరిపాలన కలిచి వేసిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు 45 వేల ఉద్యోగాలు, మైనింగ్ ఇనిస్టిట్యూట్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, అగ్రిరీసెర్చ్ సెంటర్, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ, బ్యాక్ వాటర్‌తో పంటలు నష్టపోకుండా కరకట్ట నిర్మాణం లాంటి అనేక హామీలు హామీలుగానే మిగిలి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.


