రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య
దండేపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే ప్రయోజనాలు పొందాలంటే కచ్చితంగా ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూనిక్ ఫార్మర్ ఐడీ) నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోని రైతుల ఫోన్లకు ‘మీకు ఉన్న వ్యవసాయ భూమి వివరాలు ఫార్మా ఐడీలో నమోదు కాలేదు. వెంటనే నమోదు చేసుకోవాలి..’ అని సందేశాలు పంపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆధార్ తరహాలో ఐడీని రైతులకు అందించనున్నారు. ప్రతీ రైతు తమ ఆధార్ వివరాలతో ఈకేవైసీ పూర్తి చేసి వారి భూముల వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం మీ సేవా కేంద్రాలు, వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. ఫార్మా రిజిస్ట్రీని పూర్తి చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. రైతులకు ఫోన్లు చేసి చెప్పడంతోపాటు క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలు, ముందస్తు సమాచారం ఇచ్చి గ్రామాలకు వెళ్లి పంచాయతీ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉండి రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.
ఉపయోగాలివీ..
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో భాగంగా భూమి, పంటల సమాచారం డిజిటల్ రూపంలో నిక్షిప్తమవుతుంది. పీఎం కిసాన్, ఫసల్ బీమా, రాష్ట్రీయ కిసాన్ వికాస యోజన, నేచురల్ ఫార్మింగ్ మిషన్, భూ ఆరోగ్యకార్డులు, క్రెడిట్‌కార్డులు, తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు యూనిక్ ఐడీని తప్పనిసరి చేయనున్నారు.
కొనసాగుతున్న ప్రక్రియ
యూనిక్ పార్మర్ ఐడీ జారీకి ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. పట్టాపాస్ బుక్‌లు ఉన్న రైతులు 1,64,930 మంది ఉండగా, ఇప్పటివరకు 80,600 వరకు మంది నమోదు చేసుకున్నారు. మీ సేవ కేంద్రాలతోపాటు ఏఈవోలు కూడా ఆయా క్లస్టర్లలో నమోదు చేస్తున్నారు.
తప్పనిసరిగా చేసుకోవాలి..
పట్టాపాస్‌బుక్ ఉన్న రైతులు విధిగా ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. మీ సేవా కేంద్రాలు, లేదా నేరుగా వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులను సంప్రందించాలి. ఆధార్‌కార్డుకు ఫోన్ నంబరు లింక్ తప్పనిసరి. పట్టా పాస్‌బుక్, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్‌కార్డు వివరాలతో ఫార్మా రిజిస్ట్రీ చేయించుకోవాలి. – సురేఖ, డీఏవో


