పాలనపై సర్పంచులకు శిక్షణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గ్రామ పరిపాలన సవ్యంగా సాగితేనే పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికై న సర్పంచులకు నూతన పంచాయతీరాజ్ చట్టం, పాలనపై పట్టు సాధించేందుకు పలు అంశాలపై శిక్షణ ఇవ్వాలని సంకల్పించింది. జిల్లాలోని 302 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. మొదటి విడతలో చెన్నూర్, జైపూర్, హాజీపూర్, లక్సెట్టిపేట, భీమారం, మందమర్రి మండలాల్లోని 101 మంది, రెండో విడతలో కోటపల్లి, కాసిపేట, దండేపల్లి, వేమనపల్లి, భీమిని మండలాల్లోని 106 మంది, మూడో విడతలో జన్నారం, నెన్నెల, బెల్లంపల్లి, కన్నెపల్లి, తాండూర్ మండలాల్లోని 95 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఒక్కో విడతలోని సర్పంచులను రెండు బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇస్తారు. పంచాయతీ సారథులకు ఇస్తున్న శిక్షణలో భాగంగా బయోమెట్రిక్ హాజరు నమోదు ఏర్పాటు చేయనుండగా సర్పంచ్‌లు విధిగా హాజరై నమోదు చేసుకోవాల్సిందే.
24 అంశాలు
ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 13వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లకు గ్రామ పాలన వ్యవస్థ, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం అధికారాలు, నిధులు, ఖర్చులు, సర్పంచ్ పాత్ర తదితర వాటితో మొత్తంగా 24 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. పారిశుద్ధ్యం, గ్రామసభలు, సమావేశాలు, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వనమహోత్సవం, నిధుల అడిట్, ప్రజా ఆరోగ్యం, జనన, మరణాల నమోదు, ఈ అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక, ప్రాథమిక లక్ష్యాలపై శిక్షణ ఇస్తారు. జిల్లాలోని సర్పంచులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని డీపీవో వెంకటేశ్వర్‌రావు తెలిపారు.
మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో..
సర్పంచ్‌ల శిక్షణకు ఎనిమిది మంది మాస్టర్ ట్రైనర్లను నియమించారు. వీరు ఇప్పటికే హైదరాబాద్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. కే.సతీశ్‌కుమార్(డీఎల్‌పీఓ–బెల్లంపల్లి), ఎం.మోహన్(ఎంపీడీఓ–చెన్నూర్), సాయివెంకటరెడ్డి(ఎంపీడీఓ–హాజీపూర్), జి.అనీల్‌కుమార్(ఎంపీఓ–తాండూరు), మహేశ్(ఎంపీఓ–బెల్లంపల్లి), పొలంపల్లి వెంకటేశ్(ఎంపీఓ–వేమనపల్లి), డి.వెంకటేశ్వర్లు(ఏపీఓ–డీఆర్‌డీఏ), ఎస్.సత్యనారాయణ(ఈసీ–డీఆర్‌డీఏ) మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరిస్తారు.


