పశువులతోనే అనుబంధం
నెన్నెల: మండల కేంద్రంలోని చాకలివాడకు చెందిన యువరైతు చంద్రగిరి రాకేష్‌కు వ్యవసాయమన్నా, పశువులన్నా ప్రాణం. ఆ మమకారంతోనే ఐదేళ్ల క్రితం బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో రూ.75 వేలతో కోడెను, భీమిని మండలంలోని మల్లీడిలో రూ.75 వేలతో మరో కోడెను కొనుగోలు చేశాడు. వాటికి రాముడు, భీముడు అని నామకరణం చేశాడు. వాటితోనే తనకున్న ఏడెకరాల్లో ఏటా రెండెకరాల్లో వరి, ఐదెకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. దుక్కి దున్ని.. విత్తనం నాటి.. ధాన్యం ఇళ్లకు చేరే వరకు పశువులతోనే నా అనుబంధం అంటున్నాడు. సంక్రాంతి, పొలాల అమావాస్య, ఉగాది పర్వదినాల్లో వాటిని పసుపు, కుంకుమలతో ప్రత్యేకంగా అలంకరించి పిండి వంటలతో చేసిన నైవేద్యం పెడతామని, కుటుంబ సభ్యుల వలె చూసుకుంటానని ఎడ్లతో తనకున్న అనుబంధాన్ని వివరించాడు.


