● మున్సిపాల్టీల్లో తుది జాబితా విడుదల చేసిన అధికారులు ●
మహిళా ఓటర్లు అధికం
మంచిర్యాలటౌన్: మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో ఓటరు తుది జాబితా సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపాల్టీల్లో కమిషనర్‌లు జాబితాను వెల్లడించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు సంబంధించి తుది ఓటరు జాబితాను కమిషనర్ కే.సంపత్‌కుమార్ కార్యాలయ ఆవరణలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఒకటిన ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశామని, 1,82,041 మంది ఓటర్లు ఉండగా.. 237 అభ్యంతరాలు వచ్చాయని అన్నారు. పరిశీలన అనంతరం ఓటర్లు ఇతర డివిజన్లలోకి రాకుండా మార్పులు చేసి తుది జాబితా విడుదల చేశామని తెలిపారు. తుది జాబితా ప్రకారం 1,81,778మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజా మనోహర్, మేనేజర్ ఎస్.కరుణాకర్, రెవెన్యూ ఆఫీసర్ కే.శ్రీనివాస్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వైకుంఠం పాల్గొన్నారు.
తగ్గిన ఓటర్లు
కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటరు జాబితాతో పోల్చి చూస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య తగ్గింది. ముసాయిదా జాబితా ప్రకారం 1,82,041 మంది ఉండగా, తుది జాబితాలో 263 మంది తగ్గారు. 1,81,778 మంది ఓటర్లు ఉన్నట్లుగా ప్రకటించారు. 10వ డివిజన్‌లో 2,091 మంది అత్యల్ప ఓటర్లు ఉండగా, 52వ డివిజన్‌లో 4,047 మంది ఓటర్లతో అత్యధిక ఓటర్లు ఉన్న డివిజన్‌గా గుర్తింపు పొందింది.
క్యాతనపల్లిలో..
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాపై 645 అభ్యంతరాలు అందాయని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. అన్నింటినీ పరిశీలించి సరిచేసిన అనంతరం వార్డు వారీగా ఓటర్ల తుది జాబితా ప్రచురించామని పేర్కొన్నారు.
లక్సెట్టిపేటలో..
లక్సెట్టిపేట: మున్సిపల్ ఓటరు తుది జాబితాను కమిషనర్ విజయ్‌కుమార్ సోమవారం విడుదల చేశారు. గత కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన జాబితాలో ఓటర్లు దరఖాస్తు చేసుకున్న ప్రకారం సవరణలు చేశారు. మున్సిపల్ మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నూర్‌లో..
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ ఓటరు తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, సిబ్బంది సోమవారం విడుదల చేశారు. కమిషనర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితాలో పేర్లు మార్పుకు సంబంధించిన అభ్యంతరాలను సరి చేశామని పేర్కొన్నారు. వార్డుల వారీగా తుది జాబితాను మున్సిపల్ కార్యాలయంలో అతికించామని తెలిపారు.
బెల్లంపల్లిలో..
బెల్లంపల్లి: బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీ తుది ఓటరు జాబితాను కమిషనర్ తన్నీరు రమేష్ మున్సిపల్ సోమవారం ప్రకటించారు. వార్డుల వారీగా ఓటర్ల వివరాల జాబితాను విడుదల చేశారు. జాబితా ప్రతులను మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై అతికించారు.
భార్య ఓ డివిజన్‌లో..
భర్త మరో డివిజన్‌లో..
మంచిర్యాల నగరంలో ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను పరిశీలించి సరిచేశామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ ఒక డివిజన్‌లోని ఓటరు మరో డివిజన్‌లో వచ్చారు. 52వ డివిజన్‌లోని హైటెక్‌సిటీ కాలనీలోని ఆసియన్ టవర్ సమీపంలోని భార్యాభర్తలకు చెందిన ఓట్లు ఒకరిది 52వ డివిజన్‌లో, మరొకరిది 21వ డివిజన్‌లోకి వచ్చింది. ముసాయిదా జాబితాలో తప్పును సరిచేయాలని కోరగా, భార్యాభర్తలకు చెందిన ఓట్లలో భర్త ఓటు 21వ డివిజన్‌లోకి వెళ్లిన దానిని 52 డివిజన్‌లోకి మార్చి, 52వ డివిజన్‌లో ఉన్న భార్య ఓటును 21వ డివిజన్‌కు మార్చారు. ఒకే ఇంట్లోని భార్యాభర్తల ఓట్లు వేర్వేరు డివిజన్లలో రాగా, తుది ఓటరు జాబితా లోనూ తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని మున్సిపాల్టీల ఓటర్ల వివరాలు
కార్పొరేషన్/ డివిజన్లు/
మున్సిపాల్టీ వార్డులు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
మంచిర్యాల 60 90,646 91,111 21 1,81,778
బెల్లంపల్లి 34 21,560 23,012 3 44,575
లక్సెట్టిపేట 15 8,765 9,565 1 18,331
చెన్నూర్ 18 9,711 10,991 1 19,903
క్యాతనపల్లి 22 14,761 15,023 1 29,785
● మున్సిపాల్టీల్లో తుది జాబితా విడుదల చేసిన అధికారులు ●


