● కిష్టాపూర్‌ ధాన్యం కేసులో చిత్రాలు ● ‘కొనుగోళ్ల’ కేంద్రంగానే విచారణలు ● పారదర్శకంగా విచారిస్తే బాగోతం బయటకు | - | Sakshi
Sakshi News home page

● కిష్టాపూర్‌ ధాన్యం కేసులో చిత్రాలు ● ‘కొనుగోళ్ల’ కేంద్రంగానే విచారణలు ● పారదర్శకంగా విచారిస్తే బాగోతం బయటకు

Jan 13 2026 5:51 AM | Updated on Jan 13 2026 5:51 AM

● కిష

● కిష్టాపూర్‌ ధాన్యం కేసులో చిత్రాలు ● ‘కొనుగోళ్ల’ కేంద

● కిష్టాపూర్‌ ధాన్యం కేసులో చిత్రాలు ● ‘కొనుగోళ్ల’ కేంద్రంగానే విచారణలు ● పారదర్శకంగా విచారిస్తే బాగోతం బయటకు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్ల అక్రమాల వ్యవహారాల్లో అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. జైపూర్‌ మండలం కిష్టాపూర్‌ డీసీఎంఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాల్లో మిల్లర్ల పాత్రను వదిలి వేయడం అనుమానాలకు తావిస్తోంది. గత ఏడాది యాసంగికి సంబంధించి 14వేల క్వింటాళ్ల ధాన్యం ఆ కేంద్రం నుంచే మిల్లులకు తరలించినట్లు ఆన్‌లైన్‌లో నమోదైంది. ఇందుకు 53మంది రైతుల పేర్లతో బ్యాంకు ఖాతాలను ఉపయోగించి రూ.లక్షల చొప్పున బదిలీ చేసుకున్నారు. మొత్తం రూ.2.28 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతటికీ నిర్వాహకుడితోపాటు వ్యవసాయ అధికారితోపాటు మిల్లర్లు సైతం సహకరించారు. ధాన్యం తరలించకుండానే మిల్లుల్లో దించుకున్నట్లు ‘ఓపీఎంఎస్‌’లో నమోదు చేశారు. ఈ ధాన్యాన్ని జైపూర్‌ మండలం మద్దులపల్లి, కుందారం, టేకుమట్లతోపాటు కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లోని మిల్లులకు ధాన్యం పంపినట్లుగా ట్రక్‌ షీట్స్‌లో నమోదు చేస్తూ ఆయాచిత లబ్ధి పొందిన మిల్లు యాజమాన్యాలను ఎలా తప్పించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిలో కేవలం కొనుగోలు కేంద్ర నిర్వాహకుడితోపాటు మరో ఆరుగురిపైనే ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారుల విచారణలోనూ ప్రాథమికంగా రూ.37లక్షలకే పరిమితం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ నాయకులు ఈ అక్రమాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో రాజకీయ వర్గాల్లోనూ ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

కొందరిపైనే కేసు

బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్న డబ్బుల పరంగా చూస్తే భూమి లేని కొందరిని వదిలేసి కొంత భూమి ఉన్న వారిపైనా కేసులు నమోదు చేశారు. మొత్తం సుమారు మూడున్నర కోట్ల విలువైన ధాన్యం అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదుదారు ఆధారాలతో సహా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు, జిల్లా అధికారులకు అందజేశారు. ఆ దిశగా విచారణ సాగలేదనే విమర్శలు వస్తున్నాయి. గత యాసంగి ధాన్యం కొనుగోళ్లలో చెన్నూరు మండలం దుగ్నేపల్లి, జైపూర్‌ మండలం నర్సింగాపూర్‌, కిష్టాపూర్‌ కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు వెళ్లాయి. వీటిలో నర్సింగాపూర్‌ కొనుగోలు కేంద్రం, రైస్‌మిల్లుపై క్రిమినల్‌ కేసు చేశారు. అదే సమయంలో కిష్టాపూర్‌ కేంద్రంపై విచారణ మొదలైనప్పటికీ మొదటి నుంచీ నీరుగార్చుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చివరకు ఫిర్యాదుదారు హైకోర్టుకు వెళ్లి మరీ రిట్‌ పిటిషన్‌ వేయడంతో కదలిక వచ్చింది. రెండుసార్లు విచారించి, వివరాలు తీసుకున్న విజిలెన్స్‌ అధికారులు చివరకు ఏడుగురే బాధ్యులుగా పేర్కొంటూ ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. ఈ నివేదిక ఆధారంగానే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తాజాగా కేసు నమోదైంది. అయితే వీరిలో తమ పేర్లతోనే కేసులో నమోదు చేయడంపై గ్రామంలోనూ భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు నిందితులుగా చేర్చినవారితోపాటు కేసు నుంచి తప్పించుకున్నవారి మధ్య గొడవలకు దారి తీస్తున్నాయి. ఈ కేసు తీవ్రత తగ్గించేందుకు, అందరినీ సముదాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై జిల్లాలో రైస్‌ మిల్లర్లలోనూ ఇటు పౌరసరఫరాల శాఖ అధికార వర్గాలతోపాటు రాష్ట్ర స్థాయిలో కమిషనర్‌ ఆఫీసుకు సైతం ఈ వ్యవహారం వెళ్లడంతో తదుపరి విచారణ ఎలా సాగుతుందోననే ఆసక్తి నెలకొంది. దీనిపై ఫిర్యాదు ఇచ్చిన మేరకు కేసు చేసిన పోలీసులు ఫిర్యాదుదారు నుంచి పూర్తిగా వివరాలు తీసుకుని, ఈ మేరకు ఆధారాలు తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది.

● కిష్టాపూర్‌ ధాన్యం కేసులో చిత్రాలు ● ‘కొనుగోళ్ల’ కేంద1
1/1

● కిష్టాపూర్‌ ధాన్యం కేసులో చిత్రాలు ● ‘కొనుగోళ్ల’ కేంద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement