ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
మంచిర్యాలఅగ్రికల్చర్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లతో ఫొటో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన, అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, పరిశీలన, పరిష్కారం, 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


