వ్యవసాయంలో నంబర్ వన్
చెన్నూర్: దేశంలోనే వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతులకు రూ.80 లక్షల విలువైన వ్యవసాయ పనిముట్లను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాకు రూ.2.40 కోట్ల రాయితీ పనిముట్లు వచ్చాయని, ఒక్క చెన్నూర్ నియోజకవర్గానికి రూ.40 లక్షల రాయితీ రావడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం రైతులకు బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఏవో సురేఖ, ఏడీఏ ప్రసాద్ నాయక్, ఏవోలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థినులు ఉన్నత చదువులు చదవాలి
చెన్నూర్: విద్యార్థినులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. సోమవారం చెన్నూర్‌లోని బీసీ బాలికల కళాశాల వసతిగృహాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు.
ఇసుక అక్రమాలకు పాల్పడితే చర్యలు
కోటపల్లి: ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని మంత్రి వివేక్‌వెంకటస్వామి హెచ్చరించారు. సోమవారం కొల్లూర్ గ్రామంలోని ఇసుక రీచ్‌ను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఇసుక రీచ్‌ను ఆనుకుని ఉన్న రైతులు తమ భూములకు పైసలు ఇవ్వాలని, లేదంటే ఇసుక క్వారీలకు వెళ్లే దారులను మూసివేస్తామని తెలపడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడే ఉన్న మైనింగ్ ఏడీ జగన్మోహన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్య త్వరగా పరిష్కరించాలని, అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని మైనింగ్ అధికారులను హెచ్చరించారు.
పట్టణంలో మార్నింగ్‌వాక్
చెన్నూర్: చెన్నూర్ పట్టణంలో మంత్రి వివేక్‌వెంకటస్వామి సోమవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. వార్డుల్లో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కమిషనర్ మురళికృష్ణను ఆదేశించారు. ప్రతీ వార్డులో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. రెండో విడతలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.


