విద్యుత్ వినియోగదారులకు సందేశ లేఖలు
బెల్లంపల్లి/మంచిర్యాలఅగ్రికల్చర్: వినియోగదారులకు చేరువ కావడానికి విద్యుత్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గృహజ్యోతి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లబ్ధిదారులు, రైతులకు నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్లతో ముద్రించిన లేఖలను సోమవారం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు అందజేశారు. బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు లేఖతోపాటు పూల మొక్క అందించారు. మున్సిపల్ పరిధి పెద్దనపల్లి బస్తీకి చెందిన పలువురు విద్యుత్ వినియోగదారులకు లేఖలు అందజేసి రాయితీ కరెంటు సరఫరాపై అవగాహన కల్పించారు. వినియోగదారుడి పేరు, సర్వీసు కనెక్షన్ నంబరుతో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన లేఖలను టీజీఎన్‌పీడీసీఎల్ అధికారులు గృహాలను సందర్శించి అందజేస్తున్నారు. బెల్లంపల్లిలో ఎస్‌ఈ బి.రాజన్న, డీఈ రాజేశం, ఏడీఈ కాటం శ్రీనివాస్, ఏఏవో పెద్ది రమేష్, బెల్లంపల్లి పట్టణ ఏఈ మల్లేశం, బెల్లంపల్లి రూరల్ ఏఈ రామ్ మనోహర్ పాల్గొన్నారు. జిల్లాలో గృహజ్యోతి కనెక్షన్లు 2,30,705, వ్యవసాయ కనెక్షన్లు 50,311 ఉండగా ప్రతీ లబ్ధిదారులకు లేఖలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ అధికారి బి.రాజన్న తెలిపారు.


