ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం ఆసుపత్రి పనులను ఆయన పరిశీలించారు. రూ.129.25 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి, రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం పనులను చేపడుతున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎన్నికల్లో బాల కార్మికులను
వినియోగిస్తే చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో బాల కార్మికులను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడప్రతుల అతికింపు, ఫ్లెక్సీల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ, ప్రచార సమయంలో ప్ల కార్డుల ప్రదర్శన, సభలు, సమావేశాల్లో బాలబాలికలతో పనులు చేయించినా, బాల కార్మికుల ప్రమేయం కనిపించినా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


