పత్తి కొను‘గోల్‌మాల్’
82 క్వింటాళ్లు రెండు సార్లు విక్రయం ఏడుగురిని అరెస్ట్ చేసిన సోలీసులు ఫిర్యాదుకు ముందుకురాని సీసీఐ, మిల్లు యజమాని సుమోటోగా కేసు స్వీకరించిన పోలీసులు అసలు సూత్రధారి ఎవరు?
ఇచ్చోడ:సీసీఐ ద్వారా చేపడుతున్న పత్తి కొనుగోళ్లలో గోల్‌మాల్ జరిగిన సంఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ఈ సంఘటనకు పాల్పడిన అసలు సూత్రదారులెవరు? అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. 82 క్వింటాళ్ల పత్తిని రెండుసార్లు విక్రయించి దాదాపుగా రూ.6 లక్షలు స్వాహా చేశారు. విచారణ జరిపి సుమోటో కేసుగా స్వీకరించిన పోలీసులు ఇందులో ప్రమేయం ఉన్న ఏడుగురిని రెండురోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పత్తి కొనుగోళ్లలో అవకతవకలపై సీసీఐ అధికారులుగానీ, మిల్లు యజమాని గానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
అసలేం జరిగింది?
డిసెంబర్ 15న ఇచ్చోడ మండలంలోని కోకస్‌మన్నూర్ గ్రామానికి చెందిన రైతు మండలంలోని విజయ జిన్నింగ్ మిల్లులో పత్తిని విక్రయించేందుకు ఏపీ01ఎక్స్ 5678 నంబరుగల ట్రాక్టర్‌లో తీసుకువచ్చాడు. ట్రాక్టర్‌తో పాటు తూకం వేయగా 43 క్వింటాళ్లు వచ్చింది. ట్రాక్టర్ బరువు 32 క్వింటాళ్ల 70 కిలోలు తీసివేయగా పత్తి బరువు కేవలం 11 క్వింటాళ్లు మాత్రమే ఉన్నట్లు తక్‌పట్టిలో నమోదైఉంది. డిసెంబర్ 16న అదే రైతు టీఎస్21టీ 5789 నంబర్ గల ట్రాక్టర్‌లో పత్తి లోడ్ చేసుకుని విక్రయించడానికి అదే జిన్నింగ్ మిల్లుకు వచ్చాడు. ట్రాక్టర్‌తో పాటుగా 49 క్వింటాళ్ల 6 కిలోలు కాగా వాహనం బరువు 19 క్వింటాళ్ల 20 కిలోలుగా నమోదు చేశారు. దీంతో పత్తి బరువు 29 క్వింటాళ్ల 86 కిలోలుగా నమోదైంది. దాదాపుగా ట్రాక్టర్లన్నీ పది, ఇరవై కిలోల బరువు తేడాతో ఉంటాయి. కానీ ఈ ట్రాక్టర్ బరువును దాదాపుగా 13 క్వింటాళ్లకు తగ్గించడంతోనే అసలు కథ బయటకు వచ్చినట్లు సమాచారం. పోలీసుల విచారణలో మాత్రం ఒకే వాహనం పత్తిని రెండు రోజుల పాటు విక్రయించి భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ మోసానికి పాల్పడిన వ్యక్తులు మాత్రం తక్‌పట్టీలలో రెండు వేర్వేరు వాహనాల నంబర్లు, వేర్వేరు తేదీలలో పత్తిని విక్రయించినట్లు నమోదు చేయడం వెనుక ఉన్న అసలు సూత్రదారులెవరన్నది బయటకు రావాల్సి ఉంది.
ఈ ఏడుగురు ఎవరు?
పత్తి కొనుగోళ్లలో సీసీఐని మోసగించిన ఈ ఏడుగురు వ్యక్తుల్లో మూలే మారుతి ఒకరు. ఇతను కొంతకాలంగా మిల్లులో గుమాస్తాగా పని చేస్తున్నాడు. చెర్ల అరుణ్‌కుమార్ ఆర్నెళ్లుగా ఇచ్చోడ మార్కెట్ కార్యాలయంలో పర్మినెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కాగా నవీన్ తాత్కాలిక పద్ధతిలో ఆపరేటర్. ఐద శివరాజ్ మార్కెట్‌లో దాడ్వాయిగా కొనసాగుతున్నారు. గోతి సునీల్ స్థానిక వ్యాపారి. గోపుల సత్యనారాయణ పత్తి రైతు. ఈ ఏడుగురిలో అసలు సూత్రదారులు ఎవరన్నదానిపై లోతుగా దర్యాప్తు జరిపితే కానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వివరాలు సేకరిస్తున్నాం
పత్తి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే పత్తి విక్రయించిన రైతుకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు, స్లాట్ బుకింగ్ తక్‌పట్టీలను సేకరించాం.
– ఆస్మా, ఇచ్చోడ మార్కెట్ కార్యదర్శి


