జీపీలకు ఊరట!
పంచాయతీలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు చిన్న జీపీలకు రూ. 5 లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు సీఎం హామీతో సర్పంచుల్లో నూతనోత్సాహం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రెండేళ్లుగా పంచాయతీలు ప్రత్యేక పాలనలో నిధుల లేమితో కొట్టుమిట్టాడుతూ సాగాయి. దీంతో పల్లెల్లో పాలన గాలికొదిలేసినట్లయ్యింది. ఇటీవలే పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసి నూతన పాలకవర్గాలు కొలువుదీరడంతో పల్లెపాలనకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జీపీలకు తీపి కబురు చెప్పారు. ప్రత్యేక అభివృద్ధి (స్పెషల్ డెవలప్‌మెంట్) నిధుల కింద పంచాయతీలకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు నిధులు ఇస్తామని ఇటీవల సీఎం ప్రకటనతో సర్పంచులు ఊరట చెందారు.
నిధులు లేక నీరసం
పంచాయతీల ఖజానాల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచుల ఆనందం ఆవిరైంది. రోజూవారీ పారిశుద్ధ్య పనులకు, కార్మికుల జీతాలు, ట్రాక్టర్లలో డీజిల్‌కు కూడా కనీసం డబ్బులు లేకుండా పోవడంతో కొంతమంది సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అవస్థల నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన నిధుల ప్రకటనతో పల్లెల్లో హర్షం వ్యక్తమవుతోంది. పంచాయతీలు అభివృద్ధి బాటలో నడవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులే కీలకం. ఇవి కూడా జనాభా ప్రతిపాదికన విడుదలవుతాయి. పంచాయతీలకు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. గత పాలకులకు ఇంకా బిల్లులు రాక పెండింగ్‌లోనే ఉండటంతో వడ్డీలు కడుతూనే మంజూరు కోసం జీపీలతో పాటు కలెక్టర్‌ల చుట్టూ తిరుగుతున్నారు. నిధులు రాక పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులతో అత్యవసర పనులు చేయించారు.
హర్షం వ్యక్తం చేస్తున్న పల్లెలు..
జిల్లాలో 306 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా చిన్న పంచాయతీలే. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా జీపీలకు స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రెండేళ్లకు పంచాయతీల్లో కొలువుదీరిన వేళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన మాత్రం గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపుతోంది. ఇది సర్పంచులకు ఊరట కలిగించే విషయమే. పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వనుండగా జిల్లాకు దాదాపు రూ.20 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలున్నాయి.
వెక్కిరిస్తున్న ఖజానాలే ఎక్కువ
పెద్ద పంచాయతీల్లో తప్ప మిగిలిన జీపీల్లో మాత్రం ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. భాధ్యతలు చేపట్టే సమయంలో చాలా గ్రామాల్లో నిధులు లేకపోవడంతో పలువురు సర్పంచులు పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం, ఫర్నీచర్ కొనుగోలుకు సొంత డబ్బులను వెచ్చించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పైప్‌లైన్‌ల మరమ్మతు, మోటార్లు, ట్రాక్టర్ల నిర్వహణకు నిధులులేక జాప్యం అవుతోంది. ఎస్‌డీఎఫ్ నిధులు వస్తే చాలు కొన్ని పనులైనా చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎస్‌ఎఫ్‌సీ) నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. పాలకవర్గాలు లేకపోవడం వల్లనే ఈ నిధుల విడుదల నిలిచిపోగా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగని దుస్థితి. ఏదిఏమైనా సీఎం ప్రకటన మాత్రం తమకు ఊరట కలిగిస్తోందని పలువురు సర్పంచులు పేర్కొంటున్నారు.


