కిరాణంలో అంగన్‌వాడీ కోడిగుడ్ల విక్రయం!
భీమారం: మండలంలోని మద్దికల్‌లో ఓ కిరాణ షాపులో అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన కోడిగుడ్లు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. లాల్‌బహుదూర్‌పేట అంగన్‌వాడీ టీచర్‌కు చెందిన దుకాణంలో ఐసీడీఎస్‌కు చెందిన కోడిగుడ్లు రూ.5 చొప్పున అమ్ముతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డుకు రూ.8 ఉండగా కిరాణషాపులో మాత్రం తక్కువ ధరకు లభిస్తుండడంతో చాలామంది వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కోడిగుడ్లపై ప్రభుత్వం ముద్రించిన లోగో కూడా ఉండటం గమనార్హం. మద్దికల్‌లోని మరో రెండు కేంద్రాలకు చెందిన టీచర్లు ట్రేల చొప్పున బహిరంగంగా మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు అందించాల్సిన కోడిగుడ్లని బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మను ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా కోడిగుడ్ల అమ్మకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.


