ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బజార్‌హత్నూర్‌కు చెందిన సిడాం సుధాకర్ రుణం అందించాలని, కాసిపేట మండలం రెగులగూడకు చెందిన ప్రళయ బీఎస్సీ నర్సింగ్ చదువు కొరకు ఆర్థికసాయం అందించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


