రాజన్న దర్శనానికి వెళ్లేదెట్లా?
మంచిర్యాలఅర్బన్: రెండేళ్ల కోసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో వనదేవతల జాతరకు వెళ్లేముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధం అవుతుండగా వేములవాడకు వెళ్లే భక్తులకు కనీసం ఒక్కటంటే ఒక్క బస్సు కూడా ఏర్పాటు చేయకపోవటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కోల్‌బెల్ట్ ప్రాంతమైన శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ ప్రాంతం నుంచి మేడారం జాతరకు ముందు వెళ్లివస్తుంటారు. గతంలో ఆర్టీసీ సంస్థ బస్సు నడిపినప్పుడు ప్రయాణికుల రాకపోకలతో ఆదా యం కూడా తెచ్చిపెట్టింది. ఈఏడాది ఇంతవరకు నేరుగా వెళ్లేందుకు బస్సు ఏర్పాటుపై ఉలుకుపలు కు లేకుండా పోయింది. దీంతో భక్తులు రాజన్నను దర్శించుకునేందుకు గోదావరిఖని, కరీంనగర్ చేరుకుని అక్కడి నుంచి వేములవాడకు బస్సులు మార్చుకుంటూ వెళ్లడం కష్టతరంగా మారింది. చంకలో పిల్లలు, నెత్తిన సామగ్రితో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. మంచిర్యాల నుంచి ధర్మపురి, కొండగట్టు మీదుగా వేములవాడ బస్సులు నడిపిస్తే ప్రయాణికులకు సౌకర్యంతో పాటు సంస్థకు ఆదాయం సమకూరనుంది.
తల్లులకు బంగారం (బెల్లం) మొక్కులు
మేడారం జాతర సమీపిస్తుండటంతో భక్తులు వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బెల్లం దుకాణాల వద్ద భక్తుల సందడి నెలకొంది. మంచిర్యాలలోని హోల్‌సెల్ వ్యాపారులు ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని లాథూర్, నాందేడ్ నుంచి బెల్లం దిగుమతి చేసుకున్నారు. మంచిర్యాల నుంచి మంఽథని, సిరోంచ, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, తదితర ప్రాంతాలకు బెల్లం సరఫరా చేస్తుంటారు.
బెల్లం లెక్క పక్కాగా..
మేడారం జాతర నేపథ్యంలో బెల్లం అమ్మకాలపై ఎక్సెజ్ శాఖ నిఘా పెట్టింది. వనదేవతల జాతర పే రిట నాటుసారా తరలించేందుకు అవకాశం ఉండడంతో బెల్లం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈనేపథ్యంలో వ్యాపారులు అందుకు తగినట్లు జాగ్రత్త పడుతున్నారు. బెల్లం పక్కదారి పట్టకుండా ఆధార్‌కార్డు ఉంటేనే ఎత్తు బంగారం ఇస్తుండడం గమన్హారం.


